Friday, 18 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

లక్ష్యాలను నిర్దేశించుకొని పన్నుల వసూళ్లు వేగవంతం చేయాలి

పన్నుల వసూళ్లకు పక్కా ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి.చేసుకోవాలి

లక్ష్యాలను నిర్దేశించుకొని పన్నుల వసూళ్లు వేగవంతం చేయాలి
Share Short Clip Download PDF

హనుమకొండ జిల్లా కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక అధికారి చాహత్ బాజ్ పాయి.

గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఆస్తి, నీటి పన్నుల వసూళ్ల లక్ష్యాలను నిర్దేశించుకొని, పక్కా కార్యాచరణతో ముందుకు సాగాలని... హన్మకొండ జిల్లా కలెక్టర్‌, జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక అధికారి, చాహత్‌ బాజ్‌పాయ్‌ అన్నారు.
బుధవారం హన్మకొండ ఐడీఓసీ కార్యాలయంలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌ టి. వెంకన్నతో కలిసి ట్యాక్సేషన్‌, రెవెన్యూ, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులతో ప్రత్యేక అధికారి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్కిల్‌ వారీగా ఆస్తి, నీటి పన్నుల వసూళ్ల పురోగతి, కొత్త అసెస్‌మెంట్లు, రీ-అసెస్‌మెంట్లు, ప్రభుత్వ భవనాల పన్నులు, కమర్షియల్‌, నాన్‌ కమర్షియల్‌ భవనాల గుర్తింపు, నాన్‌-కలెక్టబుల్‌ డిమాండ్లు, డబుల్‌ అసెస్‌మెంట్లు, ప్రాపర్టీ రివిజన్‌, డ్రోన్‌ సర్వే, జియోట్యాగింగ్‌ తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు.

ప్రతి ఆస్తికి డిజిటల్‌ గుర్తింపు:

నగరంలోని ప్రతి ఇంటి నంబర్‌, ఆస్తి వివరాలను జియోట్యాగ్‌ చేసి డిజిటల్‌ రికార్డులో అనుసంధానం చేయాలని అన్నారు. డ్రోన్‌ సర్వే ద్వారా గుర్తించిన నిర్మాణాలు, ఆస్తుల వివరాలను క్షేత్రస్థాయి రికార్డులతో సరిపోల్చి, పన్ను పరిధిలోకి రాని భవనాలను గుర్తించాలని సూచించారు. ప్రాపర్టీ రివిజన్‌ ప్రక్రియను వేగవంతం చేసి, కొత్త నిర్మాణాలు, ఆస్తుల్లో మార్పులు, వినియోగంలో వచ్చిన మార్పులను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని తెలిపారు.
కమర్షియల్‌ భవనాలపై ప్రత్యేక దృష్టి...
కమర్షియల్‌, నాన్‌ కమర్షియల్‌ భవనాలను క్షేత్రస్థాయిలో స్పష్టంగా గుర్తించి, నిబంధనల మేరకు పన్నులు విధించాలని కలెక్టర్‌ అన్నారు.
ప్రభుత్వ భవనాల అసెస్‌మెంట్లను కూడా పునఃపరిశీలించి పెండింగ్‌లో ఉన్న అంశాలను పరిష్కరించాలని ఆదేశించారు. సెల్‌ టవర్లు ఉన్న భవనాలను నిబంధనల ప్రకారం పరిశీలించి, వర్తించే కేటగిరీ మేరకు పన్నులు విధించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

డబుల్‌ అసెస్‌మెంట్లకు చెక్‌:

ఒకే ఆస్తికి రెండు అసెస్‌మెంట్‌ నంబర్లు ఉన్న డబుల్‌ అసెస్‌మెంట్లను ప్రత్యేకంగా గుర్తించి, వాటి పూర్తి వివరాలను వారం రోజుల్లోగా సమర్పించాలని అధికారులను ఆదేశించారు. నాన్‌-కలెక్టబుల్‌ డిమాండ్లను క్షుణ్ణంగా పరిశీలించి, వసూలుకు అవకాశం ఉన్న బకాయిలను నిబంధనల మేరకు సేకరించాలని అన్నారు.
దీర్ఘకాలంగా బకాయి ఉన్న పన్నుల విషయంలో నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేసి తదుపరి చర్యలు చేపట్టాలని సూచించారు.

టాప్‌ డిఫాల్టర్లపై ప్రత్యేక కార్యాచరణ:

పెద్ద మొత్తంలో పన్ను బకాయిలు ఉన్న టాప్‌ డిఫాల్టర్లను గుర్తించి, సర్కిల్‌ వారీగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్‌ సూచించారు.
పన్నుల వసూళ్లలో వెనుకబడిన వార్డులను గుర్తించి ప్రత్యేక బృందాలను క్షేత్రస్థాయికి పంపించాలని, రోజువారీగా వసూళ్ల పురోగతిని పర్యవేక్షించాలని ఆదేశించారు.

ఆస్తి, నీటి పన్నులపై సమన్వయంతో వసూళ్లు

ఆస్తి పన్నులతో పాటు నీటి పన్నుల వసూళ్లపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ చాహత్‌ బాజ్‌పాయ్‌ అన్నారు. సర్కిల్‌, వార్డు స్థాయిలో స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకొని, వాటి మేరకు ప్రతిరోజూ వసూళ్లు జరిగేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి పెండింగ్‌ బకాయిలను గుర్తించి వసూళ్లు చేపట్టాలని ఆదేశించారు.
జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌ టి. వెంకన్న మాట్లాడుతూ సర్కిల్‌, వార్డు స్థాయిలో పన్నుల వసూళ్ల లక్ష్యాలను విభజించి, రోజువారీ పురోగతిని సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. కొత్త అసెస్‌మెంట్లు, పెండింగ్‌ బకాయిలు, వీఎల్‌టీ, డబుల్‌ అసెస్‌మెంట్లు, కమర్షియల్‌ భవనాల గుర్తింపు, నీటి పన్నుల వసూళ్లపై రెవెన్యూ సిబ్బంది నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. జియోట్యాగింగ్‌, పన్నుల అసెస్‌మెంట్‌, వసూళ్ల ప్రక్రియలను సమన్వయంతో నిర్వహించి లక్ష్యాలను సాధించాలని అన్నారు.

ఈ ౠసమీక్ష సమావేశంలో అదనపు కమిషనర్‌ జోనా, సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్లు బిర్రు శ్రీనివాస్‌, ప్రసన్నారాణి, ట్యాక్సేషన్‌ అధికారి రామకృష్ణ, ఐటీ మేనేజర్‌ రమేష్‌, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ అధికారులు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు, ఇతర సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.