ప్రజల చిరకాల కోరిక నెరవేర్చిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
దుగ్గొండి మండలంలోని గుడ్డెలుగులపల్లె, లెంకలపల్లి గ్రామాల ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చొరవతో ఆ రెండు గ్రామాల మీదుగా వరంగల్ కు నూతన ఆర్టీసీ బస్సు సర్వీసు ప్రారంభమైంది.
మంగళవారం ఉదయం గుడ్డెలుగులపల్లె గ్రామంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో దుగ్గొండి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చుక్క రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి బస్సును ప్రారంభించారు.
రూట్ వివరాలు:
ఈ బస్సు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం నల్లబెల్లి నుండి బయలుదేరి లెంకలపల్లి, గుడ్డెలుగులపల్లి, మల్లంపల్లి, దుగ్గొండి మీదుగా వరంగల్ చేరుకుంటుంది.
ప్రజల్లో హర్షాతిరేకం:
ఇన్నేళ్లుగా సరైన బస్సు సౌకర్యం లేక విద్యార్థులు, రైతులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తమ సమస్యను ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి దృష్టికి తీసుకెళ్లగానే వెంటనే స్పందించి నర్సంపేట డిపో మేనేజర్ తో మాట్లాడి బస్సు మంజూరు చేయించారని గ్రామస్తులు తెలిపారు. బస్సు రాగానే మహిళలు స్వీట్లు పంచి ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా గుడ్డెలుగులపల్లె సర్పంచ్ జంగిలి రాజు మాట్లాడుతూ, "ఎమ్మెల్యే మాధవరెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఈ బస్సు వల్ల మా గ్రామాల రవాణా సమస్య పూర్తిగా తీరిపోయింది. ఈ సర్వీసు నిరంతరం కొనసాగేలా చూస్తామన్నారు" అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో దుగ్గొండి పిఎ సి ఎస్ చైర్మన్ ముత్యాల కుమారస్వామి, మహమ్మదాపురం పిఎ సి ఎస్ చైర్మన్ ఇంగోలి రాజేశ్వర్ రావు, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.