వికారాబాద్(రైట్స్ మీడియా): అనంతగిరి ఘాట్ రోడ్డులో ప్రైవేట్ బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఘోర ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. సంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కేసారం నుంచి ధారూర్ మండలం చింతకుంటకు వెళ్తున్న బస్సు ఘాట్ దిగిన తర్వాత ఓ మూలమలుపు వద్ద బోల్తా పడింది. స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించి బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసి, క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు. వికారాబాద్ జిల్లా ఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు.
ఈ ప్రమాద ఘటనపై గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోవడం పట్ల సంతాపం ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని సీఎస్ ను ముఖ్యమంత్రి ఆదేశించగా, బాధితులు త్వరగా కోలుకోవాలని గవర్నర్ ఆకాంక్షించారు.