హైదరాబాద్ (రైట్స్ మీడియా):
ప్రముఖ చారిత్రక నవలా రచయిత, సాహితీవేత్త, ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ విశ్రాంత ఆచార్యులు, సంఘ్ జ్యేష్ఠ కార్యకర్త ఆచార్య ముదిగొండ శివప్రసాద్ (86) గురువారం రాత్రి 8:45 గంటలకు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శివైక్యం చెందారు. ఆయన మృతి పట్ల సాహితీ లోకం, ఆర్ఎస్ఎస్ వర్గాలు, పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు.

1940 డిసెంబర్ 23న జన్మించిన ముదిగొండ శివప్రసాద్ ఆంధ్రా యూనివర్సిటీ నుంచి ఎంఏ తెలుగు, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్‌డి పట్టాలు పొందారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో సుదీర్ఘకాలం ఆచార్యుడిగా సేవలు అందించి నవసమాజానికి ఎంతోమంది పరిశోధకులను, సాహితీవేత్తలను అందించారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సంస్కృతం, గ్రీకు భాషల్లో ఆయనకు ప్రవేశం ఉంది. భారతీయ-గ్రీకు సంస్కృతులపై ఆయన చేసిన తులనాత్మక పరిశోధన విశేష గుర్తింపు పొందింది.

చరిత్రను ఆధారంగా చేసుకుని కాకతీయుల వైభవం, భారతీయ చరిత్ర, సంస్కృతి, జాతీయ చైతన్యం ప్రతిబింబించేలా ఆయన అనేక విశిష్ట రచనలు చేశారు. ‘మాలిక్ కాఫర్’, ‘కాకతీయ విజయము’, ‘ఆవాహన’, ‘అచుంబితం’, ‘రోహణం’ వంటి నవలలతో పాటు ‘శ్రీ లేఖ’, ‘శ్రీ పాదార్చన’, ‘తంజావూరు విజయం’ తదితర పాఠ్యగ్రంథాలు, అనేక కథలు, వ్యాసాలు రచించారు. ఆయన సాహిత్య రంగానికి చేసిన అమూల్యమైన సేవలకుగాను “చారిత్రక నవలా చక్రవర్తి”, “చారిత్రక నవలా సామ్రాట్”, “శివ కవీంద్ర”, “అభినవ పాల్కురికి”, “అభినవ ధూర్జటి” వంటి బిరుదులు ప్రాప్తించాయి.

కుర్తాళం పీఠాధిపతుల చేతుల మీదుగా కనకాభిషేకం (2006), సువర్ణ కంకణం (2004, 2011), స్వర్ణ గండపెండేరం (2006), ఏపీ ప్రభుత్వ ఉగాది పురస్కారం (2011) వంటి అనేక సత్కారాలు, పురస్కారాలు అందుకున్నారు. సంఘ్ జ్యేష్ఠ కార్యకర్తగా జాతీయ భావజాల వ్యాప్తికి, తెలుగు చారిత్రక సాహిత్య వికాసానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని ప్రముఖులు నివాళులర్పించారు. వారి ఆత్మకు సద్గతులు కలగాలని భగవంతుడిని ప్రార్థించారు.