Friday, 18 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జాతీయం

150 లక్షల టన్నుల లెగసీ వ్యర్థాల తొలగింపు పూర్తి

రోజు ఉత్పత్తి అయ్యే చెత్తను అదే రోజు విద్యుత్‌గా మారుస్తాం: మంత్రి పొంగూరు నారాయణ.

150 లక్షల టన్నుల లెగసీ వ్యర్థాల తొలగింపు పూర్తి
Share Short Clip Download PDF

గత ప్రభుత్వం వదిలి వెళ్లిన 150 లక్షల టన్నుల లెగసీ వ్యర్థాలను పూర్తిస్థాయిలో తొలగిస్తున్నామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో లెగసీ వ్యర్థాల తొలగింపు, ఫ్రెష్‌ వేస్ట్‌ ప్లాంట్ల ఏర్పాటు పనులపై శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌ ఎండీ సునీల్‌కుమార్‌రెడ్డి, కాంట్రాక్ట్‌ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ

భూమి ఉపరితలంపై ఉన్న వ్యర్థాలను ఇప్పటికే పూర్తిగా తొలగించామని తెలిపారు. భూమి లోపల ఉన్న చెత్తను కూడా అక్టోబర్‌ 2వ తేదీ నాటికి పూర్తిస్థాయిలో తొలగించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఆరు వేస్ట్‌-టు-ఎనర్జీ ప్లాంట్ల ద్వారా ప్రతిరోజూ ఉత్పత్తి అయ్యే చెత్తను అదే రోజు పూర్తిస్థాయిలో విద్యుత్‌గా మారుస్తామని వివరించారు. ఈ ప్లాంట్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే వరకు ఉత్పత్తి అవుతున్న ఘన వ్యర్థాల నిర్వహణ కోసం ఫ్రెష్‌ వేస్ట్‌ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

ఫ్రెష్‌ వేస్ట్‌ ప్లాంట్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు, కాంట్రాక్ట్‌ సంస్థల ప్రతినిధులకు మంత్రి సూచించారు. అక్టోబర్‌ 2 నుంచి రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో ఉత్పత్తి అయ్యే మొత్తం చెత్తను ప్లాంట్లకు తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డంపింగ్‌ యార్డులు లేని మున్సిపాలిటీలుగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దడమే లక్ష్యమని మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు.