కాకతీయ విశ్వవిద్యాలయ బాలికల వసతి గృహాల్లో నెలకొన్న వివిధ సమస్యలను విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం బుధవారం సాయంత్రం సమీక్షించారు. వసతి గృహాల్లో విద్యార్థినులకు అందుతున్న సౌకర్యాలు, పారిశుధ్యం, నిర్వహణ, విద్యుత్, ప్లంబింగ్ తదితర అంశాలను ఆయన పరిశీలించి, సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం తన కార్యాలయంలో వసతి గృహాల డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్, వివిధ వసతి గృహాల జాయింట్ డైరెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వసతి గృహాల్లో పనిచేస్తున్న సిబ్బంది, వెయిటర్లు, మహిళా అటెండెంట్లు, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ తదితర సిబ్బంది విధుల నిర్వహణపై సమీక్షించారు. విద్యార్థినులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వసతి గృహాల్లోని సమస్యలను ప్రాధాన్యత క్రమంలో తక్షణమే పరిష్కరించాలని రిజిస్ట్రార్ ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించబోమని, ఇదే విధమైన నిర్లక్ష్య ధోరణి కొనసాగితే క్రమశిక్షణా చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు. విద్యార్థినులకు మెరుగైన వసతి, సౌకర్యాలు అందేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.