ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 27వ తేదీన జిల్లాలలో వివిధ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్ అన్నారు. బుధవారం హైదరాబాదు నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఇతర శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం లోని వీడియో సమావేశ మందిరం నుండి జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ హాజరయ్యారు.
ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి
రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్.
ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ
జిల్లాలలో పర్యాటక రంగ అభివృద్ధికి జిల్లా స్థాయిలో నోడల్ అధికారులను నియమించి, వివిధ శాఖల సమన్వయంతో పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయాలని తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం కేటాయించిన నిధులను సద్వినియోగం చేసుకొని ఆకర్షణీయమైన కార్యక్రమాలను నిర్వహించాలని తెలిపారు. యువతలో పర్యాటక రంగంపై ఆసక్తిని పెంపొందించి, జిల్లాలలో పర్యాటక ప్రదేశాల ప్రచారం, అభివృద్ధి కోసం ఆసక్తి కలిగిన యువతను గుర్తించి ప్రోత్సహించాలని సూచించారు. యువ టూరిజం క్లబ్‌ల పోటీలలో విజేతలకు బహుమతులు అందజేసే కార్యక్రమాలను ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలలో నిర్వహించాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 142 పర్యాటక ప్రాంతాలను గుర్తించిన నేపథ్యంలో, ఆయా ప్రాంతాలలో సందర్శకులకు అవసరమైన ప్రాథమిక సౌకర్యాలు, మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. పర్యాటక ప్రాంతాల ప్రాముఖ్యతను విస్తృతంగా ప్రజలలోకి తీసుకు వెళ్లేందుకు వినూత్న ప్రచార కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ఫిల్మ్ టూరిజం ద్వారా పర్యాటక ప్రాంతాలను ప్రోత్సహించాలని తెలిపారు.
జ్ఞాన భారత్ కార్యక్రమంలో భాగంగా అందుబాటులో ఉన్న పురాతన మాన్యుస్క్రిప్ట్‌లను గుర్తించి డిజిటలైజేషన్ చేయడం జరుగుతుందని, ఇందు కోసం జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, జిల్లాలోని వివిధ ప్రాంతాలు, దేవాలయాలు, మఠాలు, గ్రంథాలయాలు, విద్యాసంస్థలు, ఇతర సంస్థలు, వ్యక్తుల వద్ద అందుబాటులో ఉన్న మాన్యుస్క్రిప్ట్‌లను గుర్తించి సమగ్ర జాబితా రూపొందించాలని తెలిపారు. గుర్తించిన మాన్యుస్క్రిప్ట్‌లను డిజిటలైజ్ చేసి, కేంద్రీకృత సేకరణ లోకి తీసుకువచ్చే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. జిల్లాలోని చారిత్రక, సాంస్కృతిక, సహజ పర్యాటక ప్రదేశాలను సమగ్రంగా అభివృద్ధి చేసి, వాటికి విస్తృత ప్రచారం కల్పించడం ద్వారా జిల్లాను ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, జిల్లాలోని టూరిజం, కల్చర్, యాక్షన్ ప్లాన్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు, ప్రభుత్వం పర్యటక రంగ అభివృద్ధి కోసం అధిక ప్రాధాన్యత ఇస్తుందని అందులో భాగంగానే జిల్లాలోని ఆధ్యాత్మిక, పర్యటక ప్రదేశాలలో అభివృద్ధి కోసం సంబంధిత అధికారులతో కలిసి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని, నల్లగొండ జిల్లా బుద్ధవనం పై విస్తృత ప్రచారం కల్పించాలని, సోషల్ మీడియా, ఇంస్టాగ్రామ్ ల ద్వారా పర్యటక ప్రదేశాల గురించి ప్రజలకు తెలియపరచాలని తెలిపారు. అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ సూచనల ప్రకారం ప్రత్యేక కార్యక్రమాలకు అన్ని విధాల ఏర్పాట్లు సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ కె.అనిల్ కుమార్, ఇన్చార్జి అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు, హౌసింగ్ పీడీ పురుషోత్తం, టూరిజం జిల్లా నోడల్ అధికారి శ్రీమన్నారాయణ రెడ్డి, టూరిజం అధికారి జ్యోతి, ఎఫ్డీఓ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.