రాజీ మార్గమే రాజ మార్గమని, రాజీ పడదగ్గ కేసులలో రాజీ పడి, సత్వర న్యాయం పొందాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎం. నాగరాజు తెలుపారు. జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థల ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో 3వ జాతీయ లోక్ అదాలత్‌ను శనివారం ఖమ్మం న్యాయ సేవా సదన్‌లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎం. నాగరాజు ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మాట్లాడుతూ, ఖమ్మం జిల్లాలో 15 లోక్ అదాలత్ బెంచ్‌ల ఏర్పాటు చేసినట్లు, ఇందులో ఖమ్మం హెడ్ క్వార్టర్ లో 9, సత్తుపల్లిలో 3, మధిరలో 3 బెంచ్ లు ఉన్నాయని అన్నారు. ప్రజలకు వేగంగా, సమర్థవంతంగా న్యాయం అందించేందుకు వీటిని ఏర్పాటుచేశామన్నారు. సివిల్ కేసులు, కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు, మోటార్ వాహన ప్రమాద పరిహార కేసులు, బ్యాంక్ రికవరీ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, కుటుంబ/వైవాహిక వివాదాలు, ప్రీ-లిటిగేషన్ కేసులు, వినియోగదారుల వివాదాలు, రాజీపడదగ్గ కేసులన్నీ లోక్ అదాలత్ లో పరిష్కారం అవుతాయన్నారు.

ప్రాచీన కాలం నుంచే మన సంస్కృతిలో సామరస్య పరిష్కార వ్యవస్థలు ఉన్నాయని, లోక్ అదాలత్ అనేది వివాదాలను త్వరగా, తక్కువ ఖర్చుతో ముగించే సరళమైన మార్గమని తెలిపారు. కోర్టు ఫీజులు చెల్లించి ఉంటే వాటిని సంబంధిత పక్షాలకు తిరిగి చెల్లిస్తారని, లోక్ అదాలత్ ఇచ్చే తీర్పు సివిల్ కోర్టు డిక్రీతో సమానమైన చట్టబద్ధత కలిగి ఉంటుందని అన్నారు. లోక్ అదాలత్ ద్వారా సమయం, ధనం ఆదా అవుతుందని, కోర్టుల చుట్టూ తిరిగే శ్రమ తగ్గడమే కాకుండా, కక్షలు-కార్పణ్యాలు లేకుండా రెండు పక్షాలకూ విన్-విన్ ఫలితం లభిస్తుందని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు.

ఇరుపక్షాల అంగీకారంతో తీర్పు వెలువడటం వల్ల మళ్లీ ఉన్నత కోర్టుల్లో అప్పీలు చేసుకునే అవసరం ఉండదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ అన్నారు. గతంలో నిర్వహించిన లోక్ అదాలత్‌లలో ఖమ్మం జిల్లా న్యాయశాఖ, పోలీసు విభాగం, న్యాయవాదుల సహకారంతో తెలంగాణ రాష్ట్రంలోనే 5వ ర్యాంకు సాధించిందని గుర్తుచేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ వంటి మెట్రోపాలిటన్ ప్రాంతాలతో పోటీపడి ఈ స్థాయిని సాధించడం అభినందనీయమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ, సమాజంలో వివాదాలను పరస్పర అవగాహన, ఒప్పందాల ద్వారా పరిష్కరించుకోవడానికి జాతీయ లోక్ అదాలత్ అత్యంత ప్రాముఖ్యమైన వేదిక అని అన్నారు. లోక్ అదాలత్ ద్వారా కేసులను పరిష్కరించుకోవడం వల్ల బాధితులకు, వివాదంలో ఉన్న ఇరువర్గాలకు సమయం, డబ్బు ఆదా కావడంతో పాటు చట్టబద్ధమైన శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. చిన్న చిన్న వివాదాలను ఇరుపక్షాలు కూర్చుని మాట్లాడుకోవడం వల్ల న్యాయస్థానాలపై కేసుల భారం తగ్గుతుందని తెలిపారు.

పోలీసు శాఖ, బార్ కౌన్సిల్, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, న్యాయధికారులు సమన్వయంతో పనిచేసి లోక్ అదాలత్ ద్వారా గరిష్ట సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యేలా చూడాలని అన్నారు. గత లోక్ అదాలత్‌లో దాదాపు 5,800 కేసులు పరిష్కారం కాగా, ప్రస్తుతం 7,800 కేసులు సిద్ధంగా ఉన్నాయని, ఈ సంఖ్యను 10,000 దాటించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పోలీస్ కమిషనర్ వెల్లడించారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, తమ వివాదాలను స్నేహపూర్వక వాతావరణంలో పరిష్కరించుకోవాలని అన్నారు.

ఈ సందర్భంగా లోక్ అదాలత్ లో పరిష్కారం అయిన కేసులకు సంబంధించి చెక్కులను ప్రధాన న్యాయమూర్తి అందజేశారు.

ఈ కార్యక్రమంలో మహిళా కోర్ట్ న్యాయమూర్తి వీ. శీనయ్య, ఎస్సీ, ఎస్టీ కోర్ట్ న్యాయమూర్తి పి.పి. కృష్ణార్జున్, కుటుంబ న్యాయస్థానం న్యాయమూర్తి మహేష్ నాథ్, బార్ కౌన్సిల్ సభ్యులు ఎం. శ్రీనివాస రావు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు యడ్లపల్లి రమేష్, జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి దేవీ మానస, న్యాయమూర్తులు కల్పన, శివరంజని, మురళీమోహన్, జ్యోతిర్మయి, రజని, బిందుప్రియ, ప్రవీణ్, నాగలక్ష్మి, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ప్యానెల్ అడ్వకేట్లు, వివిధ శాఖల అధికారులు, బ్యాంకింగ్/ఇన్సూరెన్స్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.