భద్రకాళి బండ్‌ను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేకాధికారి చాహత్ బాజ్ పాయి అధికారులను ఆదేశించారు.

శనివారం భద్రకాళి బండ్ వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఇప్పటికే పూర్తయిన బండ్ అభివృద్ధి పనుల నాణ్యతను పరిశీలించడంతో పాటు, పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయడంపై అధికారులకు పలు సూచనలు చేశారు. భద్రకాళి బండ్ అభివృద్ధిలో భాగంగా గ్రానైట్ పనులు, పాత్‌వేలు, గ్రీనరీ, లైటింగ్, డ్రైనేజీ తదితర పనులు పూర్తయినట్లు అధికారులు జిల్లా కలెక్టర్ కు వివరించారు.

ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా కలెక్టర్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేకాధికారి చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ భద్రకాళి బండ్ కు సంబంధించిన అభివృద్ధి పనులలో మిగిలి ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో భద్రకాళి బండ్ పరిసర ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న ప్రదేశాలను గుర్తించి విరివిగా మొక్కలు నాటాలని సూచించారు. పచ్చదనాన్ని పెంపొందిస్తూ గ్రీనరీని మరింత ఆకర్షణీయంగా అభివృద్ధి చేయాలని, సందర్శకులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భద్రకాళి బండ్‌ను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసే లక్ష్యానికి అనుగుణంగా చేపట్టిన అన్ని పనులను సమన్వయంతో, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎస్ఈ రాజ్ కుమార్, ఈఈ రవి కుమార్, డీఈలు, ఏఈలు,హార్టికల్చర్ అధికారి, తదితరులు పాల్గొన్నారు.