ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను పూర్తి పారదర్శకతతో, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌ పాయి అధికారులను ఆదేశించారు.

శనివారం వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని కనకదుర్గ కాలనీ, వడ్డేపల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సుధానగర్‌ బాలుర వసతి గృహంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాలను, ఎస్ఐఆర్ ప్రక్రియలో మ్యాపింగ్ కానీ అనామాలు ఇస్ జాబితాలో ఉన్న ఓటర్ల కోసం ఏర్పాటు చేసిన విచారణ కేంద్రాలను, కొత్తగా ఓటర్ల నమోదు, అభ్యంతరాల స్వీకరణకు చేపట్టిన స్పెషల్ క్యాంపెన్ ను జిల్లా కలెక్టర్‌ సందర్శించి ప్రక్రియ అమలు తీరును పరిశీలించారు.

ఈ సందర్భంగా పోలింగ్‌ కేంద్రాల్లో బూత్‌ లెవల్‌ అధికారులు చేపడుతున్న మ్యాపింగ్‌ కాని, అనామలీస్‌ జాబితాలో ఉన్న ఓటర్లకు నోటీసుల జారీ తదితర వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అనామలీస్‌ జాబితాలో ఉన్న ఓటర్లకు సంబంధించిన నోటీసులను ఎలాంటి జాప్యం లేకుండా సత్వరమే అందించాలని బీఎల్‌ఓలకు సూచించారు. సెలవు రోజుల్లో ఉద్యోగులు, వ్యాపారులు సాధారణంగా తమ ఇళ్ల వద్ద అందుబాటులో ఉండే అవకాశం ఉన్నందున, బీఎల్‌ఓలు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మ్యాపింగ్‌ కాని ఓటర్లు, అనామలీస్‌ జాబితాలో ఉన్న ఓటర్లు ధ్రువీకరణ పత్రాలు సమర్పించేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు. చిన్నచిన్న లోపాలు లేదా వివరాల్లో వ్యత్యాసాలు ఉన్న సందర్భాల్లో సంబంధిత ధ్రువీకరణ పత్రాలను యాప్‌లో అప్‌లోడ్‌ చేసి, నిబంధనల ప్రకారం విచారణ (హియరింగ్‌) ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో భాగంగా ప్రతి దశను నిబంధనల మేరకు పూర్తి చేసి, ఓటర్లకు అవసరమైన సమాచారం, సేవలు సులభంగా అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.

అనంతరం ఏఈఆర్వోలు, బీఎల్‌ఓలు యాప్‌ ద్వారా నిర్వహిస్తున్న డాక్యుమెంట్‌ అప్‌లోడ్‌, హియరింగ్‌ ప్రక్రియను జిల్లా కలెక్టర్‌ స్వయంగా పరిశీలించారు. ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి అవసరమైన సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఈఆర్వో/ హనుమకొండ ఆర్డీవో వెంకటేష్‌, హనుమకొండ ఏఈఆర్వో /తహసీల్దార్‌ రవీందర్‌రెడ్డి, బీఎల్‌ఓలు, ఎన్నికల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.