పరిశ్రమలు–విశ్వవిద్యాలయాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ప్రొ. ప్రతాప్ రెడ్డి తెలిపారు. విద్యార్థులకు పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలు, శిక్షణ, ఇంటర్న్‌షిప్‌లు, ప్రాజెక్టులు, ఉపాధి అవకాశాలను అందించేందుకు ప్రముఖ పరిశ్రమలు, స్టార్టప్ సంస్థలు, ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌తో అనుసంధానం పెంచుతున్నట్లు చెప్పారు.
ఇందులో భాగంగా CYIENT, T-Hub వంటి ప్రముఖ సంస్థలతో అవగాహన ఒప్పందాలు (MoUs) కుదుర్చుకోవడం ద్వారా విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులకు పరిశ్రమలతో ప్రత్యక్ష అనుసంధానం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ భాగస్వామ్యాల ద్వారా పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, పరిశోధన, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి, స్టార్టప్‌లు, ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించనున్నట్లు తెలిపారు.
పరిశ్రమల సహకారంతో విశ్వవిద్యాలయంలో అభివృద్ధి చేసే పరిశోధన ఫలితాలను వాస్తవ ప్రపంచ సమస్యలకు పరిష్కారాలుగా మలచడంతో పాటు, వాటిని సమాజానికి చేరువ చేయడమే లక్ష్యమని ఆయన అన్నారు.
గ్రామీణ విద్యార్థులకు ప్రపంచస్థాయి అవకాశాలు
గ్రామీణ, ద్వితీయ శ్రేణి ప్రాంతాల విద్యార్థులకు ప్రపంచస్థాయి విద్య, పరిశోధన, సాంకేతిక అవకాశాలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని ప్రొ. ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఏఐ, ఆధునిక సాంకేతికత, పరిశోధన, పరిశ్రమల అనుసంధానం, అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా కాకతీయ విశ్వవిద్యాలయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యా, పరిశోధనా కేంద్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.
కాకతీయ విశ్వవిద్యాలయం తరఫున ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ, డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ ప్రొ. బి. వెంకట్రామ్ రెడ్డి, యూజీసీ యూనిట్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ ప్రొ. ఆర్. మల్లికార్జున్ రెడ్డి పాల్గొన్నారు. వివిధ విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, అధ్యాపకులు, పరిశోధకులు, పరిశ్రమల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.