హైదరాబాద్ (రైట్స్ మీడియా): ఆయన వెండితెరపై కనిపిస్తే చాలు.. ప్రేక్షకుల ముఖాల్లో చిరునవ్వులు విరబూసేవి. తనదైన మార్క్ కామెడీ టైమింగ్, సహజసిద్ధమైన నటనతో వందకు పైగా చిత్రాల్లో అలరించిన ఆ నటుడి జీవితం ఇప్పుడు దీనస్థితిలో ఉంది. ఒకప్పుడు అందరినీ నవ్వించిన ఆ పెదవులు.. నేడు అనారోగ్యంతో, తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సహాయం కోసం ఆర్తిగా వేడుకుంటున్నాయి. టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ రామచంద్ర తీవ్ర అనారోగ్యంతో పక్షవాతం బారినపడ్డారు.
జూనియర్ ఎన్టీఆర్ తొలి చిత్రం 'నిన్ను చూడాలని' సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన రామచంద్ర, ఆ తర్వాత తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 'ఆనందం', 'సొంతం', 'వెంకీ', 'కింగ్', 'దుబాయ్ శీను', 'లౌక్యం' వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో హీరో స్నేహితుడిగా, విలక్షణమైన హాస్య నటుడిగా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. రామచంద్ర అనే పేరు చెబితే వెంటనే గుర్తుపట్టకపోవచ్చు కానీ, ఆయా సినిమాల్లో ఆయన ముఖం, చేసిన కామెడీ సీన్లు చెబితే ప్రతి తెలుగు ప్రేక్షకుడికి ఇట్టే గుర్తుకొస్తాయి.
దాదాపు వందకు పైగా సినిమాల్లో నటించి మెప్పించిన ఈ నటుడి జీవితంలో ఊహించని తుఫాను వచ్చింది. ఇటీవల తీవ్ర పక్షవాతానికి గురికావడంతో బ్రెయిన్లో రక్తం గడ్డకట్టి ఆయన ఎడమ చేయి, కాలు పూర్తిగా పడిపోయాయి. దీంతో ప్రస్తుతం ఆయన నడవలేని, కదలలేని స్థితిలో మంచానికే పరిమితమయ్యారు.