క్రీడలతో పాటు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఫిజికల్ డైరెక్టర్లు కృషి చేయాలని యూనివర్సిటీ వీసీ ఆచార్య కె. ప్రతాప్ రెడ్డి అన్నారు. విశ్వవిద్యాలయ సెనెట్ హాల్‌లో గురువారం ఉదయం స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి ఆచార్య వై. వెంకయ్య అధ్యక్షతన విశ్వవిద్యాలయ పరిధిలోని వ్యాయామ అధ్యాపకులతో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. విశ్వవిద్యాలయంలో క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని వీసీ తెలిపారు. పాలక మండలి సమావేశాల్లో క్రీడా మౌలిక వసతుల కల్పనకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నామని, ఇండోర్ క్రీడా సౌకర్యాలను ఒకే ప్రదేశంలో సమీకరించి ఆధునీకరించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు.
విశ్వవిద్యాలయంలో అంతర్ విశ్వవిద్యాలయ క్రీడా పోటీలను సమర్థవంతంగా నిర్వహించాలని, కొత్త క్రీడలను పరిచయం చేసి ప్రోత్సహించాలని సూచించారు. స్పోర్ట్స్ బోర్డు కార్యకలాపాలను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని వీసీ సూచించారు. ప్రతి సంవత్సరం రెండుసార్లు ఫిజికల్ డైరెక్టర్ల సమావేశాలను నిర్వహించాలని, మహిళా విద్యార్థినుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మహిళా ఫిజికల్ డైరెక్టర్లు, వ్యాయామ అధ్యాపకుల నియామకానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. విశ్వవిద్యాలయ స్వర్ణోత్సవాలు, ఆర్ట్స్ కళాశాల శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు. అలాగే ‘ఖేలో ఇండియా’ పథకం ద్వారా క్రీడా వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వానికి కూడా ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు. స్పోర్ట్స్ బోర్డు అధ్యక్షులు ఆచార్య వై. వెంకయ్య 2025–26 సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదికను సమర్పించారు.