ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉన్నత విద్య, వివిధ కెరీర్ అవకాశాలు, భవిష్యత్ లక్ష్యాలపై తగిన అవగాహన కల్పించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తమ చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి చదువుకోవటం వలన కలిగే ఉపయోగాల పై అవగాహన పరచాలి.
ప్రస్తుత కాలంలో విద్యతో పాటు ప్రత్యేక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా ఎన్నో ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. ప్రతి విద్యార్థి సంప్రదాయ కెరీర్‌లకే పరిమితం కాకుండా, తన ఆసక్తి, ప్రతిభకు అనుగుణంగా వివిధ రంగాల్లో అవకాశాలను అన్వేషించేలా ప్రోత్సహించాలన్నారు.
పదో తరగతి కూడా పూర్తి చేయలేకపోయిన ఒక వ్యక్తి వీడియో ఎడిటింగ్ నైపుణ్యాన్ని నేర్చుకొని కంటెంట్ క్రియేటర్లకు వీడియో ఎడిటింగ్ చేస్తూ నెలకు సుమారు రూ.1.50 లక్షల వరకు సంపాదిస్తున్న ఉదాహరణను కలెక్టర్ వివరించారు. విద్య ఒక అంశమైతే, నైపుణ్యం మరో ముఖ్యమైన అంశమని, విద్యార్థులకు ఇటువంటి అవకాశాలను పరిచయం చేయాల్సిన బాధ్యత మెంటార్లపై ఉందన్నారు.
విద్యార్థులు ఆంగ్లంలో మాట్లాడటం, తమ ఆలోచనలను వ్యక్తపరచడం, ఇతరులతో సంభాషించడం వంటి అంశాల్లో వెనుకబడకుండా వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలని కలెక్టర్ సూచించారు. ఒకరోజు ఉదయం నిద్రలేచిన వెంటనే ఆత్మవిశ్వాసం రాదని, ప్రతిరోజూ చిన్న చిన్న లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధిస్తూ ముందుకు సాగడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపారు. ఆంగ్లంలో మాట్లాడేందుకు భయపడే విద్యార్థులు మొదట కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, తమ చుట్టూ ఉన్న వారితో మాట్లాడటం ప్రారంభించాలని, తప్పులు జరిగినా నిరుత్సాహపడకుండా నిరంతరం సాధన చేయాలని సూచించారు.
నేను స్కూల్‌కి ఎందుకు వచ్చాను? చదువు పూర్తయ్యే నాటికి ఏ స్థాయికి చేరుకోవాలి? భవిష్యత్‌లో ఏం కావాలి?” అనే ప్రశ్నలకు ప్రతి విద్యార్థి సమాధానం తెలుసుకునేలా మెంటార్లు కృషి చేయాలని కలెక్టర్ అన్నారు. విద్యార్థులు ముందుగా తమ లక్ష్యాలను నిర్దేశించుకోవాలని, ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు దశలవారీగా చిన్న చిన్న లక్ష్యాలను ఏర్పరచుకొని సాధన చేసేలా మార్గనిర్దేశం చేయాలని తెలిపారు.
ములుగు జిల్లాలో ఇదే తరహా కార్యక్రమాన్ని నిర్వహించగా మంచి ఫలితాలు వచ్చాయని కలెక్టర్ గుర్తు చేశారు. పలువురు విద్యార్థులు డాక్టర్లు, ఇంజినీర్లు, డేటా సైంటిస్టులు, సైబర్ సెక్యూరిటీ నిపుణులు, ఆస్ట్రోనాట్స్ తదితర విభిన్న కెరీర్‌లను ఎంచుకోవాలని ఆకాంక్షలు వ్యక్తం చేశారని తెలిపారు.
మెంటర్ కార్యక్రమం ద్వారా ప్రతి విద్యార్థి వెంటనే తాను ఎంచుకున్న కెరీర్‌లో విజయం సాధించాలనేది లక్ష్యం కాదని, ముఖ్యంగా లక్ష్యం లేని విద్యార్థుల్లో లక్ష్యాలను, ఆశయాలను నింపడం, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని కలెక్టర్ స్పష్టం చేశారు.
మెంటర్లు కేవలం ఉపాధ్యాయులు సూచించిన అంశాలను విద్యార్థులకు చెప్పే వ్యక్తులుగా కాకుండా, వారి భవిష్యత్‌ను తీర్చిదిద్దే క్యాటలిస్ట్‌లుగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమం ఉద్దేశాన్ని పూర్తిగా అర్థం చేసుకొని ప్రతి విద్యార్థిలో సానుకూల ఆలోచనలు, ఆశయాలు, ఆత్మవిశ్వాసం పెంచేలా కృషి చేయాలని అన్నారు.
పాఠశాలలో మంచి భవనం, అన్ని వసతులు ఉన్నప్పటికీ విద్యార్థులకు సరైన మార్గనిర్దేశం అందకపోతే ఆశించిన ఫలితాలు సాధ్యం కావని కలెక్టర్ తెలిపారు. అందువల్ల మెంటర్లు విద్యార్థులతో నిరంతరం మమేకమై, వారి ప్రతిభను గుర్తించి, సరైన దిశలో నడిపించాలని సూచించారు.
విద్యార్థుల సామర్థ్యాలను గుర్తించి, వారికి అందుబాటులో ఉన్న వివిధ విద్యా, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి అవకాశాలను పరిచయం చేసి, తమకు నచ్చిన రంగాన్ని ఎంచుకునేలా ప్రోత్సహించాలని కలెక్టర్ అన్నారు. మెంటర్ల కృషి ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కూడా ఉన్నత స్థాయికి ఎదగగలరని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డిఈఓ సదానందం, ఏయంవో పెసర ప్రభాకర రెడ్డి, స్క్వేర్ ఫౌండేషన్ ప్రతినిధి శ్రీలక్ష్మి రెడ్డి, సంబంధిత అధికారులు, శిక్షకులు, మెంటర్లు తదితరులు పాల్గొన్నారు.