Monday, 28 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

భవిష్యత్తు కోసం ఎదురుచూసేవారు కాదు... భవిష్యత్తును నిర్మించేవారు!

• ‘జెన్-జీ’ యువతకు ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు దిశానిర్దేశం

భవిష్యత్తు కోసం ఎదురుచూసేవారు కాదు... భవిష్యత్తును నిర్మించేవారు!
Share Short Clip Download PDF

నరసరావుపేట(రైట్స్ మీడియా): నేటి ఆధునిక కాలంలో 'జెన్‌-జీ' యువత భవిష్యత్తు కోసం కేవలం ఎదురుచూసే తరం కాదని, తమ అపారమైన ప్రతిభతో ఈ దేశ భవిష్యత్తును స్వయంగా నిర్మించే తరమని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు స్పష్టం చేశారు. నేటి యువత వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో విజయపథంలో నడవడానికి అవసరమైన పలు కీలక అంశాలపై ఆయన శనివారం సమగ్ర మార్గదర్శనం చేశారు.

డిగ్రీలు సరిపోవు.. నైపుణ్యాలే ఆయుధం

ప్రస్తుత పోటీ ప్రపంచంలో కేవలం కళాశాల డిగ్రీలు మాత్రమే సరిపోవని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా కంప్యూటర్, ఏఐ (AI), ఇంగ్లీష్, కమ్యూనికేషన్, డిజిటల్ స్కిల్స్ వంటి సరికొత్త నైపుణ్యాలను యువత నిరంతరం పెంపొందించుకోవాలని సూచించారు. యువత కేవలం ఉద్యోగాల వేటలోనే ఆగిపోకుండా, నలుగురికి ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తలుగా, స్టార్టప్ వ్యవస్థాపకులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన ఉద్యోగాలను తీసేస్తుందనే ఆందోళన చెందకుండా, ఏఐ టూల్స్‌ను ఉపయోగించుకునే పరిజ్ఞానాన్ని పెంచుకుని ఉత్పాదకతను సాధించాలన్నారు.

డిగ్రీలు సరిపోవు.. నైపుణ్యాలే ఆయుధం

సోషల్ మీడియాపై అప్రమత్తత.. మత్తుకు దూరం

సోషల్ మీడియా వినియోగంపై యువతకు పలు సూచనలు చేశారు. ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యే ప్రతి సమాచారం నిజం కాదని, ఏదైనా షేర్ చేసే ముందు వాస్తవాలను నిర్ధారించుకోవాలని హితవు పలికారు. అమూల్యమైన సమయాన్ని వృథా చేయకుండా, ప్రతిరోజూ కొంత సమయాన్ని చదువు, నైపుణ్యాభివృద్ధి, కుటుంబం, వ్యాయామం కోసం కేటాయించాలని తెలిపారు. సరైన పౌష్టికాహారం, తగినంత నిద్ర, వ్యాయామంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. క్షణికావేశంలో తీసుకునే ఒక్క తప్పుడు నిర్ణయం జీవితాన్ని నాశనం చేస్తుందని హెచ్చరిస్తూ.. మత్తు పదార్థాలకు యువత పూర్తిగా దూరంగా ఉండాలని స్పష్టం చేశారు.

సోషల్ మీడియాపై అప్రమత్తత.. మత్తుకు దూరం

ఆర్థిక క్రమశిక్షణ.. సామాజిక బాధ్యత

చిన్న వయసు నుంచే సంపాదన, పొదుపు, పెట్టుబడులపై అవగాహన పెంచుకుంటూ అనవసర అప్పులకు దూరంగా ఉండే ఆర్థిక క్రమశిక్షణను అలవర్చుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు లభించిన వెంటనే బాధ్యతతో, విచక్షణతో వ్యవహరించి దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. ఒక పరీక్ష, ఉద్యోగం లేదా వ్యాపారంలో ఎదురయ్యే తాత్కాలిక వైఫల్యాలకు ఎట్టిపరిస్థితుల్లోనూ కుంగిపోవద్దని, పట్టుదలతో మళ్లీ ప్రయత్నించాలని యువతకు ధైర్యం చెప్పారు.

యువతకు ఎమ్మెల్యే స్ఫూర్తిదాయక సందేశం:

"చదువు, నైపుణ్యం, క్రమశిక్షణ, ఆరోగ్యం, సాంకేతిక పరిజ్ఞానం అనే ఈ ఐదు అంశాలను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో భాగం చేసుకోవాలి. సోషల్ మీడియా స్క్రీన్లలో కనిపించే ఆకర్షణలను చూసి మురిసిపోకుండా, నిజ జీవితంలో కష్టపడి సాధించే శాశ్వత విజయాలనే లక్ష్యంగా ఎంచుకోవాలి. మీ కుటుంబానికి, మీ నియోజకవర్గానికి, దేశానికి ఉపయోగపడే అత్యున్నత స్థాయికి మీరు ఎదగాలి."

భవిష్యత్తు కోసం ఎదురుచూసేవారు కాదు... భవిష్యత్తును నిర్మించేవారు!

Source / reference: Journalist Sk. Gouse, Palnadu.