జిడబ్ల్యూఎంసీ, అక్టోబర్ 28(రైట్స్ మీడియా): వరంగల్ నగరాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, మెరుగైన మౌలిక సదుపాయాలతో, సుస్థిర పట్టణంగా తీర్చిదిద్దే లక్ష్యంతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) వరంగల్ మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది.
హనుమకొండ జిల్లా కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక అధికారి చాహత్ బాజ్పాయ్ సమక్షంలో బుధవారం ఎన్ఐటీ వరంగల్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లో నిర్వహించిన కార్యక్రమంలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న, ఎన్ఐటీ వరంగల్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి కలిసి ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఈ ఒప్పందం ద్వారా ఎన్ఐటీ వరంగల్లోని విద్యా, పరిశోధన, సాంకేతిక నైపుణ్యాలను నగర అభివృద్ధి కార్యక్రమాలకు అనుసంధానం చేయనున్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఘన వ్యర్థాల నిర్వహణ, స్మార్ట్ పట్టణ ప్రణాళిక, పర్యావరణహిత అభివృద్ధి వంటి రంగాల్లో సాంకేతిక సలహాలు, వినూత్న పరిష్కారాలను అన్వేషించనున్నారు. జీడబ్ల్యూఎంసీ ఇంజినీర్లు, వివిధ విభాగాల అధికారులకు ప్రత్యేక శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలతో పాటు అర్హులైన ఉద్యోగులకు ఉన్నత విద్యావకాశాలను పరిశీలించనున్నారు.