హైదరాబాద్(రైట్స్ మీడియా): రాజధాని నగరంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తాగునీటి సమస్య తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని, రిజర్వాయర్లలో నీటి నిల్వలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఎంసీఆర్హెచ్ఆర్డీ బోధి పెవిలియన్‌లో కోర్ పరిధిలో మంచినీటి సరఫరా, ఎస్టీపీల నిర్మాణం, ట్రీటెడ్ వాటర్ వినియోగంపై జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎల్‌నినో నేపథ్యంలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని మురుగునీటి శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీలు) వంద శాతం సామర్థ్యంతో పని చేసేలా చూడాలన్నారు. సెక్రటేరియట్, సీఎంఓ, అవుటర్ రింగ్ రోడ్, మెట్రో రైల్ తదితర కార్యాలయాల్లో పచ్చదనం నిర్వహణకు, పబ్లిక్ పార్కులు, రోడ్ల శుభ్రతకు, భవన నిర్మాణాలకు మరియు డేటా సెంటర్లకు కచ్చితంగా ట్రీటెడ్ వాటర్‌నే వినియోగించాలని, ప్రైవేట్ ఎస్టీపీల ఏర్పాటును ప్రోత్సహించాలని స్పష్టం చేశారు.
ఎస్టీపీల నిర్వహణకు సోలార్ విద్యుత్‌ను వినియోగించేలా చూడాలని రెడ్కో అధికారులను ఆదేశించిన సీఎం.. నీటి శుద్ధిలో అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలు పాటిస్తూ నాణ్యతలో రాజీ పడొద్దన్నారు. ప్రతి నీటిశుద్ధి కేంద్రం వద్ద ప్రత్యేక అధికారిని నియమించి కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించాలని, వీటి పనితీరును 'హైడ్రా' ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చెప్పారు.
ట్రీటెడ్ వాటర్ సరఫరా చేసే ట్యాంకర్లను ట్రాక్ చేసే వ్యవస్థతో పాటు, నీటి కోసం ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేసి నవంబర్ 1 నుంచి ఈ ఆదేశాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాగా, ప్రస్తుతం 26 ఎస్టీపీల్లో ట్రీటెడ్ వాటర్‌ను గ్రీన్ ట్యాంకర్ల ద్వారా కేవలం రవాణా రుసుము మాత్రమే వసూలు చేస్తూ ఉచితంగా అందిస్తున్నట్లు జలమండలి అధికారులు వివరించిన ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సహా సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.