‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ మోడ్రన్ జర్నలిజం’ పుస్తక రచయిత, సాంకేతిక జర్నలిజం నిపుణుడు ముద్దం నరసింహ స్వామిని నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ (ఎన్‌ఎఫ్‌ఎస్‌యూ) వ్యవస్థాపక వైస్ ఛాన్సలర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత డా. జేఎం వ్యాస్ అభినందించారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఉన్న ఎన్‌ఎఫ్‌ఎస్‌యూను సందర్శించిన తెలంగాణ జర్నలిస్టుల బృందంతో వైస్ డా. జేఎం వ్యాస్ సమావేశమయ్యారు.
ముద్దం నరసింహస్వామిని సత్కరించిన ఎన్‌ఎఫ్‌ఎస్‌యూ వైస్ ఛాన్సలర్ డా. జేఎం వ్యాస్
⏩'ఏఐ ఇన్ మోడ్రన్ జర్నలిజం’ పుస్తకంపై డా. జేఎం వ్యాస్ ప్రశంసలు.
⏩ జర్నలిజంలో ఏఐ, మెటావర్స్ ప్రాధాన్యాన్ని వివరించిన ఎన్‌ఎఫ్‌ఎస్‌యూ వైస్ ఛాన్సలర్.
⏩ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) హైదరాబాద్ ఆధ్వర్యంలో గుజరాత్ పర్యటనకు వెళ్లిన తెలంగాణ జర్నలిస్టుల బృందం.
ముద్దం నరసింహ స్వామి రాసిన పుస్తకాన్ని పరిశీలించిన డా. వ్యాస్..
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, కృత్రిమ మేధ, జర్నలిజంలో వాటి వినియోగాన్ని విశ్లేషించిన తీరు ప్రశంసనీయమన్నారు. ముఖ్యంగా ఈ పుస్తకంలోని ‘మెటావర్స్’ అధ్యాయం తమ విశ్వవిద్యాలయంలో బోధిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ముద్దం నరసింహ స్వామిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పీఐబీ ఐఐఎస్ అధికారిణి వర్గంటి గాయత్రి, తెలంగాణ జర్నలిస్టుల బృందం పాల్గొంది.
జర్నలిజంలో కృత్రిమ మేధ, మెటావర్స్, డిజిటల్ సాంకేతికతల ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో ఈ అంశాలపై రూపొందుతున్న పుస్తకాలు జర్నలిస్టులు, మీడియా విద్యార్థులు, పరిశోధకులకు ఉపయోగకరంగా ఉంటాయని డా. వ్యాస్ పేర్కొన్నారు.
ఫోరెన్సిక్ విద్య, పరిశోధనపై అవగాహన:
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) హైదరాబాద్ ఆధ్వర్యంలో గుజరాత్ పర్యటనకు వెళ్లిన తెలంగాణ జర్నలిస్టుల బృందం ఎన్‌ఎఫ్‌ఎస్‌యూను సందర్శించింది. విశ్వవిద్యాలయంలోని విద్య, పరిశోధన, శిక్షణ కార్యక్రమాలను డా. జేఎం వ్యాస్ వివరించారు. ఫోరెన్సిక్ సైన్స్, బిహేవియరల్ సైన్స్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఇన్వెస్టిగేషన్ విభాగాలపై అవగాహన కల్పించారు. అనంతరం జర్నలిస్టుల బృందం ఆధునిక ప్రయోగశాలలు, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఫోరెన్సిక్ మౌలిక వసతులను పరిశీలించింది.