పదేళ్ల పాలనలో ప్రజలను మోసం చేసి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రజాపాలనపై ధర్నాలు చేయడం సిగ్గుచేటని జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి నేరెళ్ల మహేందర్ గౌడ్ విమర్శించారు. జమ్మికుంట బహిరంగ సభలో రూ.1,000 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వెయ్యి రోజులు గడిచినా రూ.1,000 కూడా తీసుకురాలేదని ఆరోపించారు.
ప్రభుత్వ అధికారిక క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ ఫొటో తొలగించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫొటో ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో తామే తొలగించాల్సి వస్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను లబ్దిదారులకు అందిస్తూ, అవే పథకాలు అందడం లేదని ఎమ్మెల్యే విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్ఎస్ హయాంలో నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, కేజీ నుంచి పీజీ ఉచిత విద్య, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి హామీల అమలు ఏమైందో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై చిల్లర విమర్శలు, ప్రచారం మానుకుని నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని మహేందర్ గౌడ్ సూచించారు.
ప్రజలను మోసం చేసిన బీఆర్ఎస్ కు కాంగ్రెస్ ను విమర్శించే హక్కు లేదు
జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి నేరెళ్ల మహేందర్ గౌడ్.