వర్ధన్నపేట మండలంలోని రామోజీ కుమ్మరిగూడెం తండాలో అంతర్గత రోడ్లు బురదమయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామపంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడంతో తండా వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తండాలోని ప్రధాన రహదారితో పాటు అంతర్గత సీసీ రోడ్లు గుంతలమయమై వర్షం నీరు నిలిచిపోయి బురదగా మారాయి . వృద్ధులు, చిన్న పిల్లలు, గర్భిణీలు నడవాలంటేనే భయపడుతున్నారు. వాహనాలు కూడా వెళ్లలేని పరిస్థితి ఉంది.
బురదమయమైన అంతర్గత రోడ్లు: దోమలతో నరకం చూస్తోన్న గిరిజనులు
రామోజీ కుమ్మరిగూడెం తండాలో అభివృద్ధి శూన్యం | పట్టించుకోని గ్రామపంచాయతీ పాలకవర్గం, అధికారుల నిర్లక్ష్యం!.
దోమల బెడద - రోగాల భయం:
రోడ్లపై నిలిచిన మురుగు నీటితో దోమలు విపరీతంగా పెరిగిపోయాయి. సాయంత్రం అయితే దోమల దాడితో ఇళ్లలో ఉండలేకపోతున్నామని తండా వాసులు వాపోతున్నారు. మలేరియా, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. గ్రామపంచాయతీ ఫాగింగ్ చేయడం లేదని, బ్లీచింగ్ చల్లడం లేదని ఆరోపిస్తున్నారు.
పట్టించుకోని పాలకవర్గం, అధికారుల నిర్లక్ష్యం!:
ఈ విషయంపై పలుమార్లు సర్పంచ్, కార్యదర్శికి చెప్పిన పట్టించుకోవడం లేదని తండా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని ఇతర గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నా తమ తండాను మాత్రం పట్టించుకోవడం లేదని అంటున్నారు.
తండా వాసుల డిమాండ్:
వెంటనే అంతర్గత రోడ్లకు మరమ్మతులు చేపట్టి, దోమల నివారణకు ఫాగింగ్ చేయాలని తండా వాసులు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో మండల కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరిస్తున్నారు.