Friday, 18 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
అంతర్జాతీయం

లండన్‌లోని ప్రసిద్ధ అంబేద్కర్ హౌస్‌ను సందర్శించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

లండన్‌లోని ప్రసిద్ధ అంబేద్కర్ హౌస్‌ను సందర్శించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
Share Short Clip Download PDF

లండన్ (రైట్స్ మీడియా): తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తో కలిసి లండన్‌లోని ప్రసిద్ధ అంబేద్కర్ హౌస్‌ను సందర్శించారు. బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 1921-22లో లండన్‌లోని ప్రిమ్‌రోజ్ ప్రాంతంలోని 10 కింగ్ హెన్రీ’స్ రోడ్‌లో నివసించారు. ఆ చారిత్రక ఇంటిని ముఖ్యమంత్రి దర్శించుకున్నారు.

ప్రసిద్ధ అంబేద్కర్ హౌస్‌ సందర్శకుల డైరీలో..

“మహనీయులు డాక్టర్ అంబేద్కర్ హౌస్‌ను సందర్శించడం ఒక ఆధ్యాత్మిక క్షేత్రాన్ని సందర్శించడం లాంటిది. ఇది జీవితకాలపు స్ఫూర్తినిస్తుంది. సామాజిక న్యాయం కోసం అంకితభావంతో పనిచేయాలన్న నా ఆకాంక్ష మరింత పెరిగింది” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శకుల డైరీలో రాశారు.

అంబేద్కర్ హౌస్‌ను ప్రస్తుతం డాక్టర్ అంబేద్కర్ ఆశయాలకు అంకితమైన మ్యూజియంగా ఏర్పాటు చేశారు. రాజ్యాంగబద్ధత, సమానత్వం, కులరహిత సమాజం, అణచివేత లేని సమాజం, సామాజిక న్యాయానికి అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వడం వంటి ఆయన సిద్ధాంతాలను ఈ మ్యూజియం ప్రతిబింబిస్తుంది. దాదాపు గంటపాటు సాగిన పర్యటనలో అంబేద్కర్ మ్యూజియం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన యాంటీ కాస్ట్ డిస్క్రిమినేషన్ అలయన్స్ (ACDA) చైర్ శ్రీమతి సంతోష్ దాస్ MBE, యూకేలో బాబాసాహెబ్ జీవితానికి సంబంధించిన వివిధ అంశాలను ముఖ్యమంత్రి కి వివరించారు.

పర్యటన పూర్తయిన అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ..

“నా జీవితంలో ఇది గొప్ప క్షణాల్లో ఒకటి. భారతీయుల్లో గొప్ప వ్యక్తుల్లో ఒకరైన బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి జీవితంలోని వ్యక్తిగత కోణాన్ని చూసి, ఆయనతో ముడిపడిన వస్తువులను తాకగలగడం ఎంతో గొప్ప అనుభూతి” అని అన్నారు.