Thursday, 17 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
ప్రత్యేక కథనాలు

ఉద్యోగ భారంలో తల్లిదండ్రులు... ఏకాకితనంలో పిల్లలు!

అడ్డ సతీష్ | నల్లబెల్లి మండలం | ప్రత్యేక కథనం (రైట్స్ మీడియా)

ఉద్యోగ భారంలో తల్లిదండ్రులు... ఏకాకితనంలో పిల్లలు!
Share Short Clip Download PDF

ప్రేమ ఉంది.. పర్యవేక్షణే ఏది?

పిల్లలకు ఉజ్జ్వల భవిష్యత్తును అందించాలనే తాపత్రయంతో తల్లిదండ్రులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. రోజువారీ ఉద్యోగాలు, వ్యవసాయ పనులు, వ్యాపారాల్లో ఎదురయ్యే సవాళ్లు, టార్గెట్లు సాధించడంలోనే రోజంతా గడిపివేస్తున్నారు. పిల్లలకు కావాల్సిన అన్ని రకాల వసతులు సమకూరుస్తున్నామనే భావనలోనే ఉంటున్నారు తప్ప, వారి అంతరంగంలో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదనే ఆందోళన వ్యక్తమవుతోంది.
పని ముగించుకుని ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఉద్యోగ సంబంధిత విషయాలు, తోటి సిబ్బందితో చర్చలకే ప్రాధాన్యం ఇస్తుండటంతో పిల్లలతో నాణ్యమైన సమయం గడిపే అవకాశం లేకుండా పోతోంది. పలితంగా పిల్లలు ఇంట్లో వింతగా ప్రవర్తిస్తున్నా, చెడు స్నేహాల వైపు అడుగులు వేస్తున్నా తల్లిదండ్రులు దాన్ని గుర్తించలేకపోతున్నారు.

సమస్యలున్నా చెప్పుకోలేని స్థితి:

పాఠశాలలో తోటి విద్యార్థులతో వేధింపులు ఎదురైనా, చదువులో ఇబ్బందులు ఉన్నా తల్లిదండ్రులకు చెప్పుకుందామనుకున్నా ఆ అవకాశం పిల్లలకు దక్కడం లేదు. ఆత్మీయమైన పలకరింపు కరువై మానసికంగా కుంగిపోతున్నారు. కనీస పర్యవేక్షణ లేకపోవడంతో తమ సమస్యలను బయటి వ్యక్తులకు చెప్పుకుని, వారి తప్పుడు సలహాల ఉచ్చులో పడి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు.

తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: రోజూ సమయం కేటాయించాలి:

రోజువారీ పనులు ఎంత బిజీగా ఉన్నా, ప్రతిరోజూ కొంత సమయాన్ని కేవలం పిల్లల కోసమే కేటాయించాలి.

దినచర్యను అడిగి తెలుసుకోవాలి:

పాఠశాలలో లేదా కళాశాలలో రోజంతా ఏం జరిగింది? ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? అనే విషయాలను అడిగి తెలుసుకోవాలి.

మానసిక ధైర్యాన్ని ఇవ్వాలి:

పిల్లల ప్రవర్తనలో ఏవైనా మార్పులు కనిపిస్తే గద్దించడం కాకుండా, వారి సమస్యను అర్థం చేసుకుని స్నేహపూర్వక వాతావరణంలో పరిష్కరించాలి.