Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
రాష్ట్రాలు

ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా మంత్రి పొంగులేటి

వేర్వేరు గ్రామాల్లో పలువురికి పరామర్శ

ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా మంత్రి పొంగులేటి
Share Short Clip Download PDF

మంగళగూడెంలో ముగ్గురిని కోల్పోయిన కుటుంబానికి ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని అధికారులకు ఆదేశం

ఖమ్మం రూరల్ (రైట్స్ మీడియా): ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలుస్తూ, బాధితులకు భరోసా కల్పించేందుకు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముందుంటున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఖమ్మం రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించారు.

సర్పంచ్‌కు పరామర్శ..

జాన్ బాత్ తండా సర్పంచ్ భీమా నాయక్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి పొంగులేటి ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

సర్పంచ్‌కు పరామర్శ..

ముగ్గురిని కోల్పోయిన కుటుంబానికి భరోసా..

మంగళగూడెం గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలోని మోటం మణియమ్మ, మోటం కీర్తన, కావ్య ఇటీవల ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతిచెందారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో తీవ్ర విషాదంలో ఉన్న కుటుంబ సభ్యులను మంత్రి పొంగులేటి పరామర్శించారు. వారి దీనస్థితిని చూసి చలించిన ఆయన.. బాధిత కుటుంబానికి గ్రామంలో ఇంటి స్థలం కేటాయించడంతోపాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి నిర్మించి ఇవ్వాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. కష్టకాలంలో మంత్రి చూపిన చొరవపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

ముగ్గురిని కోల్పోయిన కుటుంబానికి భరోసా..

గోళ్లపాడు గ్రామానికి చెందిన పరికిపల్లి భద్రమ్మ అనే వృద్ధురాలు మృతిచెందడంతో ఆమె నివాసానికి వెళ్లిన మంత్రి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ పార్టీ ఖమ్మం రూరల్ మండల అధ్యక్షుడు తోట వీరభద్రం, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మద్ది మల్లారెడ్డి, కాంగ్రెస్ నాయకులు వీరెల్లి అప్పారావు, కొప్పుల చంద్రశేఖర్, పలువురు సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.