కాకతీయ విశ్వవిద్యాలయ స్వర్ణోత్సవ సంవత్సరం సందర్భంగా విశ్వవిద్యాలయ ప్లేస్‌మెంట్ సెల్, వరంగల్ నిర్మాణ్ ఓఆర్‌జీ ఆధ్వర్యంలో ఆగస్టు 25వ తేదీ మంగళవారం ఉదయం 9.30 గంటల నుంచి విశ్వవిద్యాలయ సెనెట్ హాల్‌లో “మెగా ఆఫ్-క్యాంపస్ జాబ్ డ్రైవ్–2026” నిర్వహించనున్నట్లు ప్లేస్‌మెంట్ సెల్ సంచాలకులు డా. చిర్ర రాజు తెలిపారు. జాబ్ డ్రైవ్‌కు సంబంధించిన గోడపత్రికను విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం ఆవిష్కరించారు. 2018–2026 మధ్య ఐటీఐ, డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు క్యూఆర్ కోడ్ ద్వారా ముందస్తుగా నమోదు చేసుకుని జాబ్ డ్రైవ్‌కు హాజరుకావచ్చని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.25,000 వరకు ప్రారంభ వేతనం లభించనుందని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయ వైస్‌ఛాన్సలర్ ఆచార్య కే. ప్రతాప్ రెడ్డి జాబ్ డ్రైవ్‌ను ప్రారంభించనున్నారు. ప్రముఖ సంస్థలు Frugies (Sutherland, Sagility, Digitide, Airtel), Quess (KIA Motors, Schneider, Dixon), Lenskart, Apollo, Consortax, A & C Solutions, Disha Staffing తదితర సంస్థలు ఈ డ్రైవ్‌లో పాల్గొని అభ్యర్థులను ఎంపిక చేయనున్నాయి.
గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం, ప్లేస్‌మెంట్ సెల్ సంచాలకులు డా. చిర్ర రాజు, తెలుగు విభాగాధిపతి డా. ఎం. లింగయ్య, నిర్మాణ్ ఓఆర్‌జీ సెంటర్ మేనేజర్ బోట్లపాటి రాఘవ కుమార్, తీగల శ్రీకాంత్, నరేష్ తుప్పారి తదితరులు పాల్గొన్నారు. జాబ్ డ్రైవ్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను కాకతీయ విశ్వవిద్యాలయ వెబ్‌సైట్ www.kakatiya.ac.in ద్వారా తెలుసుకోవచ్చని డా. చిర్ర రాజు తెలిపారు.
కాకతీయ యూనివర్సిటీలో ఈ నెల 25న మెగా జాబ్ మేళా: ప్లేస్‌మెంట్ సంచాలకులు డాక్టర్ చిర్ర రాజు గౌడ్