Friday, 18 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

ఖిల్లా రోప్ వే పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్‌ దివాకర టిఎస్

ఖిల్లా రోప్ వే పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్‌ దివాకర టిఎస్
Share Short Clip Download PDF

ఖిల్లా రోప్ వే నిర్మాణ పనులను వేగవంతం చేసి, నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ దివాకర టిఎస్‌ అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్‌ దివాకర టిఎస్‌ ఖిల్లా రోప్ వే నిర్మాణ పనుల పురోగతిని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఇప్పటివరకు పూర్తయిన పనులు, జరుగుతున్న నిర్మాణ ప్రక్రియ, పనుల పురోగతి తదితర వివరాలను సంబంధిత అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఖిల్లా పైకి వెళ్లి నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ దివాకర టిఎస్‌ మాట్లాడుతూ

రోప్ వే నిర్మాణ పనులు ఆశించిన వేగంతో జరగడం లేదని, పనుల్లో వేగం పెంచాలని సూచించారు. నిర్మాణానికి అవసరమైన మెటీరియల్‌ను ముందస్తుగానే పక్కా ప్రణాళికతో సమకూర్చుకోవాలని, మెటీరియల్‌ కొరత కారణంగా పనులకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పనుల పురోగతిపై సంబంధిత అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు నిరంతరం పర్యవేక్షిస్తూ ఫాలోఅప్‌ చేయాలని కలెక్టర్‌ సూచించారు. నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం ప్రతి దశ పనులను పూర్తి చేసేలా పక్కా కార్యాచరణ రూపొందించుకోవాలని అన్నారు.
రోప్ వే నిర్మాణంలో నాణ్యతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఖిల్లా ప్రాంతంలో షీట్‌ రాక్‌ ఉన్నందున జియాలజిస్ట్‌తో సమన్వయం చేసుకుని భౌగోళిక పరిస్థితులను పూర్తిగా పరిశీలించాలని సూచించారు. నిర్మాణానికి సంబంధించిన అవసరమైన అన్ని సాంకేతిక పరీక్షలను తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు.
రోప్ వే నిర్మాణం అత్యంత పటిష్టంగా, సురక్షితంగా ఉండేలా అన్ని సాంకేతిక ప్రమాణాలను పాటించాలని కలెక్టర్‌ అన్నారు. పనుల నాణ్యత, భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని, ప్రతి నిర్మాణ దశలో నాణ్యతా ప్రమాణాలను పరిశీలిస్తూ ముందుకు సాగాలని స్పష్టం చేశారు.
పనులు వేగవంతంగా నాణ్యతతో పూర్తయ్యేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ సూచించారు.

ఖమ్మం ఖిల్లాపై పర్యాటక ఆకర్షణలు అభివృద్ధి చేయాలి:

ఖమ్మం ఖిల్లాకు మరింత మంది పర్యాటకులను ఆకర్షించేలా ప్రత్యేక పర్యాటక ఆకర్షణ కార్యక్రమాలు, సౌకర్యాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్‌ సూచించారు. ఖిల్లాపై స్టార్‌ గేజింగ్‌ కోసం టెలిస్కోప్‌ ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని, దీనివల్ల సందర్శకులకు ప్రత్యేక అనుభూతి కల్పించడంతో పాటు పర్యాటక ఆకర్షణ మరింత పెరుగుతుందని అన్నారు.
పర్యాటకుల సౌకర్యార్థం ఖిల్లాపై ఒక క్యాంటీన్‌ను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తద్వారా పర్యాటకులకు అవసరమైన ఆహార, త్రాగునీటి సౌకర్యాలు అందడంతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని అన్నారు.
పర్యాటకుల వాహనాల పార్కింగ్‌కు అనువైన స్థలాన్ని తహసీల్దార్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించి గుర్తించాలని జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు. ఖిల్లాకు వచ్చే పర్యాటకులకు సౌకర్యవంతంగా ఉండేలా పార్కింగ్‌ ప్రాంతాన్ని ముందస్తుగా ప్రణాళిక చేసుకోవాలని సూచించారు.
ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్‌ వెంట జిల్లా టూరిజం శాఖ అధికారి సుమన్‌ చక్రవర్తి, ఖమ్మం అర్బన్ మండల తహసీల్దార్ జయచంద్ర, సంబంధిత అధికారులు, ఇంజినీరింగ్‌ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ఖిల్లా రోప్ వే పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్‌ దివాకర టిఎస్