సివిల్, క్రిమినల్ కేసుల పరిష్కారానికి మధ్యవర్తిత్వం అద్భుత అవకాశమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ కుంచాల సునీత పేర్కొన్నారు. గురువారం జిల్లా కోర్టులో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సివిల్ లేదా క్రిమినల్ కేసులైనప్పటికీ, ఇరువర్గాలు రాజీ మార్గంలో సమస్యలను పరిష్కరించుకోవడానికి మధ్యవర్తిత్వం ఒక ఉత్తమ ప్రత్యామ్నాయ మార్గమన్నారు. పూర్వం మన పల్లెల్లో పెద్దల సమక్షంలో కూర్చుని సమస్యలను ఎలా అయితే సర్దుబాటు చేసుకునేవారో, అదే పద్ధతిలో మధ్యవర్తిత్వం ద్వారా వివాదాలను అక్కడికక్కడే పరిష్కరించుకోవచ్చని తెలిపారు. కోర్టుకు వచ్చే ఇద్దరు వ్యక్తుల మనస్తత్వాన్ని, వారి సమస్యను లోతుగా అర్థం చేసుకుని, ఇరువర్గాలకు ఆమోదయోగ్యమైన రీతిలో రాజీ కుదిర్చి కేసులు పరిష్కరించడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా యాక్సిడెంట్ కేసులకు సంబంధించి ఇన్సూరెన్స్ లేని చోట, యజమానులతో మాట్లాడి త్వరితగతిన సెటిల్మెంట్ చేసి బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ మధ్యవర్తిత్వ ప్రక్రియ ద్వారా కేసులను పరిష్కరించుకోవడానికి ఎవరికీ ఎలాంటి ఆర్థిక భారం ఉండదని, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఈ సేవలు పూర్తిగా ఉచితంగా అందుబాటులో ఉంటాయని తెలిపారు. శిక్షణ పొందిన 20 మంది ప్రత్యేక అడ్వకేట్లు మధ్యవర్తులుగా అందుబాటులో ఉన్నారని వెల్లడించారు. కోర్టుల చుట్టూ తిరిగే పనిలేకుండా మధ్యవర్తిత్వంతో తక్షణ న్యాయం పొందవచ్చని, ప్రజలందరూ సంవత్సరాల తరబడి కాలం, డబ్బు వృథా చేసుకోకుండా, న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అందుబాటులో ఉన్న ఈ మధ్యవర్తిత్వ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో జిల్లా సీనియర్ సివిల్ జడ్జి వంగర భవాని, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీనిజ కోహిర్కర్, కోర్టు సూపరింటెండెంట్ శేఖర్ తదితరులున్నారు.