తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, చిరు ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి: బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి డిమాండ్
తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
పెండింగ్ డీఏలు విడుదల చేయడంతో పాటు పీఆర్సీని అమలు చేయాలని కోరారు. ఉద్యోగుల ప్రధాన సమస్యలపై ఇప్పటికే అవగాహన ఉన్నప్పటికీ కమిటీల పేరుతో కాలయాపన చేయడం సరికాదన్నారు. సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల వేతనాల నుంచి ఈహెచ్‌ఎస్ కోసం 1.5 శాతం కోత విధిస్తున్నప్పటికీ వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేవని ఆరోపించారు. ఈహెచ్‌ఎస్‌ను పూర్తి స్థాయిలో అమలు చేసి, ఇప్పటివరకు వసూలు చేసిన మొత్తాల వినియోగంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన పెన్షన్, గ్రాట్యుటీ, ఇతర బకాయిలను వెంటనే చెల్లించాలని, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీలు, గ్రామపంచాయతీ సిబ్బంది, మున్సిపల్ కార్మికులు, హోంగార్డులు, 104, 108 సిబ్బంది, వీవోఏలు తదితర చిరు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని అన్నారు. పీఆర్సీ, డీఏలు, ఓపీఎస్, ఈహెచ్‌ఎస్, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు, చిరు ఉద్యోగుల వేతనాలపై ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ, కాలపరిమితిని ప్రకటించాలని రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఉద్యోగులు తమ హక్కుల కోసం ప్రశ్నిస్తున్నారని, వారి సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించాలని సూచించారు.