పల్నాడు జిల్లా నూతన ఎస్పీగా జగదీష్ ఆదహళ్లి, ఐపీఎస్., గురువారం బాధ్యతలు స్వీకరించారు. నూతన బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ ని పోలీసు అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి, శుభాకాంక్షలు తెలిపారు.
పల్నాడు జిల్లాలో ప్రజల భద్రతకు, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి సారిస్తానని పల్నాడు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన జగదీష్ ఆదహళ్లి, ఐపీఎస్., తెలిపారు. గురువారం పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, తాను మొదటిసారిగా ఎస్పీగా బాధ్యతలు స్వీకరిస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి కి మరియు డీజీపీ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. శాంతిభద్రతలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని, చట్ట ప్రకారం ముందుకు వెళ్తానని, ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
జిల్లాలో ఫ్యాక్షన్ గొడవలు, జాతీయ, రాష్ట్ర రహదారులు ఎక్కువగా ఉన్నందున రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు, వాటి నివారణపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తానని జిల్లా ఎస్పీ తెలిపారు. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. ప్రజలు ఎప్పుడైనా తనకు సమాచారం అందించవచ్చని తెలిపారు. అనంతరం జిల్లాలోని నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల సబ్ డివిజన్ల పరిధిలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో కలిసి వివరాలు తెలుసుకున్నారు.
ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటామని, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి IPS, నరసరావుపేట DSP M. హనుమంతరావు, సత్తెనపల్లి DSP చైతన్య, గురజాల DSP మహేశ్వరరావు, AR DSP గాంధీ రెడ్డి, RI లు,సీఐలు, ఎస్‌ఐలు నూతన ఎస్పీ ని మర్యాదపూర్వకంగా కలిసి, శుభాకాంక్షలు తెలిపారు.