వినాయక నిమజ్జనం సందర్భంగా నిజామాబాద్ నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమం జరిగేలా పోలీస్ శాఖ విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఈ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య కమాండ్ కంట్రోల్ హాల్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల నిఘా వ్యవస్థ ద్వారా గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని క్షుణ్ణంగా పర్యవేక్షించారు.

ప్రధాన రహదారులు, నిమజ్జన మార్గాలు, విగ్రహాల తరలింపు ప్రాంతాలు, ట్రాఫిక్ రద్దీ ఏర్పడే ప్రదేశాలు, నిమజ్జన కేంద్రాల వద్ద పరిస్థితులను సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. విధుల్లో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బందికి అవసరమైన సూచనలు చేస్తూ, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రజలు , గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు పోలీసు శాఖకు సహకరించి, నిమజ్జన కార్యక్రమాన్ని శాంతియుతంగా , సురక్షితంగా నిర్వహించుకోవాలని పోలీస్ కమిషనర్ సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ కమాండ్ కంట్రోల్ హాల్ నుంచి నిరంతర నిఘా ఏర్పాటు చేయడం ద్వారా గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని సమర్థవంతంగా పర్యవేక్షించారు.