Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

సమీకృత గ్రావెల్ నిర్వహణ విధానం అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు

సులభతరంగా మట్టి అనుమతులు: హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి

సమీకృత గ్రావెల్ నిర్వహణ విధానం అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు
Share Short Clip Download PDF

హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో జిల్లాలో నూతనంగా అమలులోకి తీసుకురానున్న సమీకృత గ్రావెల్ నిర్వహణ విధానంపై తహసీల్దార్లు,సాగునీటిపారుదల అధికారులు, ఆర్ఐలు, పంచాయతీ కార్యదర్శులు, జీపీవోలకు శిక్షణ కార్యక్రమం.

హనుమకొండ (రైట్స్ మీడియా): చిన్న నిర్మాణ, ఇతర అభివృద్ధి పనులకు అవసరమైన గ్రావెల్‌(మట్టి)ని చట్టబద్ధంగా తీసుకెళ్లడానికి సులభతరమైన ఆన్‌లైన్ అనుమతుల విధానాన్ని జిల్లాలో అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి తెలిపారు.

శనివారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలో నూతనంగా అమలులోకి తీసుకురానున్న సమీకృత గ్రావెల్ నిర్వహణ విధానంపై తహసీల్దార్లు, సాగునీటిపారుదల శాఖ అధికారులు, ఆర్ఐలు, పంచాయతీ కార్యదర్శులు, జీపీవోలకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ...

సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) సహకారంతో సమీకృత గ్రావెల్ నిర్వహణ విధానం (ఇంటిగ్రేటెడ్ గ్రావెల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్) ఆన్ లైన్ పోర్టల్ ను రూపొందించినట్లు తెలిపారు. ఈ నూతన విధానం అమలుకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించేందుకు రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ పాలన అధికారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. గ్రావెల్(మట్టి) అవసరమైన వారు అనుమతులు పొందడంలో ఇబ్బందులు, ఇతర సమస్యలకు పరిష్కారంగా రూపొందించిన నూతన ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా చిన్న పరిమాణంలో గ్రావెల్ (మట్టి)అవసరమైన వారు కూడా సరళమైన విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. దరఖాస్తులను రెవెన్యూ అధికారులు పరిశీలించి, సంబంధిత భూముల వివరాలను ధ్రువీకరించిన అనంతరం అనుమతులు మంజూరు చేస్తారని తెలిపారు.

పట్టా భూముల నుంచి కూడా నిబంధనల ప్రకారం గ్రావెల్( మట్టిని) తీసుకెళ్లేందుకు ఈ విధానంలో అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా గతంలో సాగునీటి కాలువల నిర్మాణ సమయంలో నిల్వ చేసిన గ్రావెల్‌ను తొలుత వినియోగంలోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ నిల్వలను తొలగించడం ద్వారా విలువైన ప్రభుత్వ భూమిని తిరిగి వినియోగంలోకి తీసుకురావచ్చని, ఆ భూములను భవిష్యత్తులో ప్రభుత్వ సంస్థలు, ప్రజాప్రయోజన కార్యక్రమాలకు ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ...

చెరువులు, ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ప్రాంతాల నుంచి గ్రావెల్ (మట్టి) తరలింపునకు దరఖాస్తులు వచ్చినప్పుడు రెవెన్యూ అధికారులు వాటిని ఇరిగేషన్ శాఖకు పంపించి సంబంధిత అధికారుల అభిప్రాయాలు, సిఫార్సులు తీసుకునే వెసులుబాటు కూడా ఈ పోర్టల్‌లో కల్పించినట్లు తెలిపారు. అనుమతులు మంజూరైన అనంతరం గ్రామపంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది కీలక పాత్ర పోషించాలని సూచించారు.

అనుమతి పొందిన వ్యక్తులు ఎన్ని వాహనాల ద్వారా, ఎన్ని ట్రిప్పుల్లో, ఎంత పరిమాణంలో గ్రావెల్ తరలిస్తున్నారనే వివరాలను గ్రామస్థాయిలో నమోదు చేసి పర్యవేక్షించాలని తెలిపారు. ఇందుకోసం గ్రామపంచాయతీల్లో అందుబాటులో ఉన్న సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ విధానం ద్వారా అక్రమ గ్రావెల్ ( మట్టి)తవ్వకాలు, రవాణాకు అడ్డుకట్ట వేయడంతో పాటు, అనుమతుల ప్రక్రియలో పారదర్శకత లభిస్తుందన్నారు. తద్వారా గ్రామపంచాయతీలకు కూడా ఆదాయం సమకూరుతుందని తెలిపారు. ఈ విధానం ద్వారా గ్రావెల్ (మట్టి)అనుమతుల ప్రక్రియను సులభతరం చేయడం ద్వారా ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడడం, అక్రమ మైనింగ్‌ను నియంత్రించడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఈ విధానాన్ని త్వరగా అమల్లోకి తీసుకురావాలని ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా సీజీజీ ప్రతినిధులు నూతన పోర్టల్ పనితీరు, దరఖాస్తు విధానం, అనుమతుల పరిశీలన, క్షేత్రస్థాయి పర్యవేక్షణ అంశాలపై అధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. తహసిల్దార్లు, పంచాయతీ కార్యదర్శులు నూతన విధానానికి సంబంధించి అడిగిన పలు సందేహాలకు కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, అదనపు కలెక్టర్ రవి నివృత్తి చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి, జిల్లా రెవెన్యూ అధికారి కె. శ్రీనివాస్, ట్రైనీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోహిత్ నేత, మైనింగ్ శాఖ ఏడి రామాచారి, హనుమకొండ ఆర్డిఓ వెంకటేష్, ఇతర శాఖల అధికారులతో పాటు తహసిల్దార్లు, ఆర్ఐలు, పంచాయతీ కార్యదర్శులు, జి పి ఓ లు పాల్గొన్నారు.

సమీకృత గ్రావెల్ నిర్వహణ విధానం అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు