చెరువులు, ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ప్రాంతాల నుంచి గ్రావెల్ (మట్టి) తరలింపునకు దరఖాస్తులు వచ్చినప్పుడు రెవెన్యూ అధికారులు వాటిని ఇరిగేషన్ శాఖకు పంపించి సంబంధిత అధికారుల అభిప్రాయాలు, సిఫార్సులు తీసుకునే వెసులుబాటు కూడా ఈ పోర్టల్‌లో కల్పించినట్లు తెలిపారు. అనుమతులు మంజూరైన అనంతరం గ్రామపంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది కీలక పాత్ర పోషించాలని సూచించారు.
అనుమతి పొందిన వ్యక్తులు ఎన్ని వాహనాల ద్వారా, ఎన్ని ట్రిప్పుల్లో, ఎంత పరిమాణంలో గ్రావెల్ తరలిస్తున్నారనే వివరాలను గ్రామస్థాయిలో నమోదు చేసి పర్యవేక్షించాలని తెలిపారు. ఇందుకోసం గ్రామపంచాయతీల్లో అందుబాటులో ఉన్న సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ విధానం ద్వారా అక్రమ గ్రావెల్ ( మట్టి)తవ్వకాలు, రవాణాకు అడ్డుకట్ట వేయడంతో పాటు, అనుమతుల ప్రక్రియలో పారదర్శకత లభిస్తుందన్నారు. తద్వారా గ్రామపంచాయతీలకు కూడా ఆదాయం సమకూరుతుందని తెలిపారు. ఈ విధానం ద్వారా గ్రావెల్ (మట్టి)అనుమతుల ప్రక్రియను సులభతరం చేయడం ద్వారా ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడడం, అక్రమ మైనింగ్‌ను నియంత్రించడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఈ విధానాన్ని త్వరగా అమల్లోకి తీసుకురావాలని ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా సీజీజీ ప్రతినిధులు నూతన పోర్టల్ పనితీరు, దరఖాస్తు విధానం, అనుమతుల పరిశీలన, క్షేత్రస్థాయి పర్యవేక్షణ అంశాలపై అధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. తహసిల్దార్లు, పంచాయతీ కార్యదర్శులు నూతన విధానానికి సంబంధించి అడిగిన పలు సందేహాలకు కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, అదనపు కలెక్టర్ రవి నివృత్తి చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి, జిల్లా రెవెన్యూ అధికారి కె. శ్రీనివాస్, ట్రైనీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోహిత్ నేత, మైనింగ్ శాఖ ఏడి రామాచారి, హనుమకొండ ఆర్డిఓ వెంకటేష్, ఇతర శాఖల అధికారులతో పాటు తహసిల్దార్లు, ఆర్ఐలు, పంచాయతీ కార్యదర్శులు, జి పి ఓ లు పాల్గొన్నారు.