హుజురాబాద్ మండలం చెల్పూర్ గ్రామంలోని ఒకటో వార్డులో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన సామూహిక కుంకుమ పూజా కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య కోలాహలంగా సాగింది. ఈ కార్యక్రమానికి మహిళలు పెద్ద ఎత్తున హాజరై విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు.
పూజారి సాత్విక్ అయ్యగారి పర్యవేక్షణలో, వేద మంత్రోచ్ఛారణల నడుమ ఈ కుంకుమ పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులు దేవుని వద్ద కొబ్బరికాయలు కొట్టి, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం నిర్వాహకులు అందరికీ తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తులంతా స్వామివారి కృపాకటాక్షాలు పొందారు.
ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో బీసీ ఆజాదీ ఫెడరేషన్ డివిజన్ అధ్యక్షుడు పంజాల తిరుపతి గౌడ్ కుటుంబ సమేతంగా పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. వీరితో పాటు స్థానిక యువకులు, ఉత్సవ కమిటీ సభ్యులు, పెద్ద సంఖ్యలో మహిళలు మరియు భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
చెల్పూర్ లో భక్తిశ్రద్ధలతో సామూహిక కుంకుమ పూజలు.. విశేషంగా తరలివచ్చిన మహిళలు