Thursday, 17 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

అర్హులైన లబ్ధిదారులకు రుణాలు సకాలంలో అందించాలి

బ్యాంకర్లు, అధికారుల సమన్వయంతో లక్ష్యాలను సాధించాలి: హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి

అర్హులైన లబ్ధిదారులకు రుణాలు సకాలంలో అందించాలి
Share Short Clip Download PDF

హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో వివిధ శాఖల అధికారులు, బ్యాంకర్లతో జిల్లా సంప్రదింపుల కమిటీ , జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశం

జిల్లాలో ప్రభుత్వ పథకాల అమలులో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా రుణాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి బ్యాంకర్లను, సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో వివిధ శాఖల అధికారులు, బ్యాంకర్లతో జిల్లా సంప్రదింపుల కమిటీ , జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశంలో వ్యవసాయం, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, స్వయం సహాయక సంఘాలు, విద్య, గృహ నిర్మాణం తదితర రంగాలకు బ్యాంకుల ద్వారా అందిస్తున్న రుణాల పురోగతిని కలెక్టర్ సమీక్షించారు.

ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ

బ్యాంకర్లు జిల్లాలో నిర్దేశించిన రుణ లక్ష్యాలను సాధించడంతో పాటు అర్హులైన దరఖాస్తుదారులకు రుణాలు మంజూరు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. రుణాల కోసం వచ్చిన దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించాలని పేర్కొన్నారు.
ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా బ్యాంకర్లు, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో ఆర్థిక కార్యకలాపాలను మరింత ప్రోత్సహించేందుకు బ్యాంకులు చిన్నతరహా వ్యాపారాలు, పరిశ్రమలు, మహిళా స్వయం సహాయక సంఘాలకు అవసరమైన రుణాలను అందించాలని సూచించారు. ముద్ర రుణాలను అర్హులైన లబ్ధిదారులకు అందేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు. సోలార్ యూనిట్లకు రుణాలను మంజూరు చేయాలన్నారు.

ఆర్సెటీ ద్వారా ఇస్తున్న శిక్షణ కోర్సులను కూడా అప్‌గ్రేడ్ చేయాలన్నారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా కోర్సుల్లో మార్పులు తీసుకురావాలన్నారు. ఇంతకుముందే మనం పర్యాటక రంగానికి సంబంధించి ఒక ఒప్పందం గురించి చర్చించాం. అందులో భాగంగా పర్యాటక గైడ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని, వారికి సర్టిఫికెట్ కోర్సులు లేదా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించాం. అదే విధంగా హాస్పిటాలిటీ రంగానికి కూడా శిక్షణ కార్యక్రమాలను రూపొందిస్తే బాగుంటుందన్నారు.

మడికొండ లో చిన్న తరహా పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు అవకాశాలు ఉన్నాయని, మెప్మా, డీఆర్డీఏ ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగడానికి కృషి చేయాలన్నారు. జిల్లాలో వార్షిక రుణ లక్ష్యంలో భాగంగా మొదటి త్రైమాసికంలో రూ. 2939కోట్లు (33శాతం )లబ్ధిదారులకు బ్యాంకర్ల ద్వారా మంజూరు చేయటం జరిగిందన్నారు. జిల్లాలో వార్షిక రుణ లక్ష్యాన్ని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని బ్యాంకర్లను ఆదేశించారు.

ఈ సమావేశంలో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ విష్ణుప్రియ, నాబార్డ్ ఏజీఎం చంద్రశేఖర్, డీఆర్డీవో మేన శ్రీను, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ నవీన్ కుమార్, మెప్మా పీడీ రాజేశ్వర్,ఆర్బీఐ రీజినల్ లీడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ యశ్వంత్ సాయి, యూబీఐ రీజినల్ హెడ్ కమలాకర్, ఆర్సెటీ డైరెక్టర్ రవి, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

అర్హులైన లబ్ధిదారులకు రుణాలు సకాలంలో అందించాలి