Monday, 28 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
ప్రత్యేక కథనాలు

బహుముఖ పోరాట ధీరుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ: ఆయన స్ఫూర్తితోనే బీసీ హక్కుల సాధన

⏩తెలంగాణ సమాజానికి కొండా లక్ష్మణ్ బాపూజీ బహుముఖ సేవల స్మరణ.. సెప్టెంబర్ 27న ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం: సాయిని నరేందర్ న్యాయవాది, రాజకీయ & సామాజిక విశ్లేషకులు

బహుముఖ పోరాట ధీరుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ: ఆయన స్ఫూర్తితోనే బీసీ హక్కుల సాధన
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ(ఫైల్ ఫోటో)
Share Short Clip Download PDF

⏩నేడు(సెప్టెంబర్ 27) ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం(రైట్స్ మీడియా).

హనుమకొండ (రైట్స్ మీడియా): చరిత్ర పుటల్లో స్వయంకృషితో తన పేరును తనే లిఖించుకున్న గొప్ప ప్రజ్ఞాశాలి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ. ఆయన జీవిత చరిత్రను, తెలంగాణ ఉద్యమ చరిత్రను వేరుచేసి చూడడం సాధ్యం కాదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమిక పోషించి, కేవలం రాజకీయ నాయకుడిగానే కాకుండా రాజనీతిజ్ఞుడిగా విశేష కీర్తిని పొందిన బాపూజీ జీవితాన్ని ఆవిష్కరించడం సామాన్యమైన విషయమేమీ కాదు. తన జ్ఞాపకం ఎరిగిన నాటి నుంచి ఉద్యమాలే జీవితంగా బతికి, తన సర్వస్వాన్ని ప్రజల కోసం దారపోసిన ధీశాలి ఆయన. ప్రత్యేక తెలంగాణ కోసం మంత్రి పదవిని తృణప్రాయంగా వదులుకోవడమే కాకుండా, తెలంగాణ వచ్చేవరకు ఏ ఒక్క పదవినీ స్వీకరించనని శపథం చేసి ఆచరించిన మహా నిష్టాగరిష్ఠుడు.
20, 21వ శతాబ్దాల భిన్న దశలలో జీవించిన రాజకీయ నాయకుల్లో బాపూజీ జీవితం అత్యంత విశిష్టమైనది. ఆయన జీవితం తెలంగాణ విశాల రాజకీయ, సామాజిక చరిత్రలకు అద్దం పడుతుంది. పేదలపై పెత్తందారీ అరాచకాలకు వ్యతిరేకంగా ఉద్యమించడమే కాకుండా, ఏకకాలంలో ఆరు భిన్నమైన ప్రజా ఉద్యమాలతో ఆయన జీవితం ముడిపడి ఉంది. అవి వరుసగా: నిజాం వ్యతిరేక పోరాటం, వెనుకబడిన తరగతుల (బీసీ) ఉద్యమం, చేనేత సహకారోద్యమం, తెలంగాణ రైతాంగ పోరాటం, స్వాతంత్ర్యోద్యమం, మరియు ప్రత్యేక తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాలు.

గాంధేయ మార్గం - సాయుధ పోరాటం:

నియంతృత్వ భూస్వామ్య నిజాం పాలనకు వ్యతిరేకంగా తలెత్తిన ఉద్యమంలో యువ కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించిన బాపూజీ, బహిరంగ జీవితంలో గాంధేయ తత్వానికి కట్టుబడి ఉంటూనే, నిజాంపై జరిగిన సాయుధ ప్రతిఘటనోద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్నారు. జాతీయోద్యమంలో సామాజిక మూలాలు వీడకుండా ప్రజా రాజకీయాలు చేసిన ఆయన, చేనేత సహకారోద్యమంలో నేతన్నల హక్కుల సాధనకు శ్రమించారు. మగ్గాల యజమానులు, వ్యాపారుల ప్రయోజనాలు వేరు, నేత పనివారల ప్రయోజనాలు వేరు అని స్పష్టం చేస్తూ అట్టడుగు శ్రేణులకు చేరువయ్యారు.
కార్యకర్తగా స్వాతంత్ర్య ఉద్యమంలో కీలకపాత్ర వహించిన బాపూజీ, ఎం.ఎన్. రాయ్ ఆలోచనలు, రచనలు, ప్రసంగాలకు ప్రభావితుడై ఆయన ప్రసంగాలను 'భారత విప్లవ సమస్యలు' పేరిట ఉర్దూలోకి అనువదించి ముద్రించారు. సుభాష్ చంద్రబోస్ అతివాద ధోరణి, గాంధీజీ స్వామ్యవాద ఆలోచనా ధోరణుల సమ్మేళనం ఆయనపై తీవ్ర ప్రభావం చూపింది. కుటీర పరిశ్రమలు, వృత్తి కులాలపై ఆధారపడి జీవించే వడ్రంగి, కంసాలి, కంచర, మేదర, బెస్త, కల్లుగీత, దర్జీ, వడ్డెర వంటి ఉత్పత్తి కులాల అభ్యున్నతి కోసం విశేష కృషి చేశారు. నాణ్యమైన విద్య, ఆర్థిక సామర్థ్యం లేకుండా సామాజిక, రాజకీయ సాధికారత సాధ్యం కాదనే వాస్తవాన్ని గుర్తించి, బీసీ కులాలు ఆర్థిక స్థోమతను మెరుగుపరచుకునేలా అనేక కార్యక్రమాలు నిర్వహించారు.

మూడు తరాల తెలంగాణ ఉద్యమానికి పెద్ద దిక్కు:

మూడు తరాల ఉద్యమానికి సాక్షిగా నిలిచిన బాపూజీ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర డిమాండ్ ముందుకు వచ్చిన ప్రతి సందర్భంలోనూ క్రియాశీలక పాత్ర పోషించారు. 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటును ప్రతిఘటించడంలో, 1969 తొలిదశ ఉద్యమంలో, 1995 మలిదశ ఉద్యమంలో, అలాగే చివరి దశ పోరాటంలోనూ పెద్ద దిక్కుగా నిలిచారు.
1952లో ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన, కాంగ్రెస్ పార్టీలో 23 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్‌గా, మంత్రిగా సేవలందించారు. 1969 తొలిదశ తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. బీసీలకు మేలు చేసే బి.పి. మండల్ కమిషన్ నివేదికకు వ్యతిరేకంగా పార్లమెంటులో రాజీవ్ గాంధీ మాట్లాడినందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి అణగారిన వర్గాల పక్షాన నిలిచారు. 2001లో టీఆర్ఎస్ పార్టీ ఏర్పడినప్పుడు తన నివాసాన్నే పార్టీ కేంద్ర కార్యాలయానికి అందించిన సౌజన్యశీలి ఆయన. 96 ఏండ్ల వయస్సులో సైతం తెలంగాణ కోసం ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్ష చేసి ఉద్యమంలో సామాజికతను జోడించారు.

పోరాట ఘట్టాలు & జీవిత విశేషాలు:

➤తొలి అడుగులు: నిజాం పాలనలోని ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ తాలూకా వాంకిడి గ్రామంలో కొండా పోశెట్టి, అమ్మక్కలకు 1915 సెప్టెంబర్ 27న జన్మించారు. 16 ఏళ్ల వయస్సులోనే చంద్రాపూర్‌లో గాంధీజీని కలిసి స్వాతంత్ర్యోద్యమం వైపు ఆకర్షితులయ్యారు.
వందేమాతరం ఉద్యమం: 1938లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రారంభమైన వందేమాతరం ఉద్యమంలో పాల్గొని జైలుపాలయ్యారు.

➤న్యాయవాదిగా సేవలు: ఆర్థిక ఇబ్బందుల వల్ల కళాశాల విద్యను నిలిపివేసి, సాయంత్రం వేళల్లో న్యాయవాద కోర్సు పూర్తిచేసి అడ్వకేట్ అయ్యారు. చాకలి ఐలమ్మ, బందగి వంటి విప్లవకారులకు ఉచితంగా న్యాయ సహాయం అందించారు.

➤నిజాంపై బాంబు దాడి: 1947 డిసెంబర్ 4న నిజాం నవాబుపై జరిగిన బాంబు దాడి బృందంలో బాపూజీ పాల్గొన్నారు. అనంతరం విచారణను తప్పించుకుని బొంబాయి వెళ్లగా, తెలంగాణ భారతదేశంలో విలీనమయ్యాక ఆయనపై ఉన్న కేసులన్నీ ఎత్తివేశారు.

➤చేనేత & బీసీ రంగాలకు సేవలు: 1944 నుంచి 1960 వరకు రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా, 1951 నుంచి 1956 వరకు రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంఘం వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. హైదరాబాద్ రాజ్యంలో చేనేత వృత్తి నిర్వహించే 15 కులాలను బీసీ జాబితాలో చేర్చడంలో కీలక పాత్ర పోషించారు.

➤నేటి తరానికి ఆదర్శం: ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలకు గుర్తింపుగా "ఆచార్య", "సహకార రత్న" బిరుదులు దక్కాయి. 2005 ఆగస్టు 9న భారత రాష్ట్రపతి నుంచి "ఎమినెంట్ ఫ్రీడమ్ ఫైటర్" అవార్డును అందుకున్నారు. తన సొంత నిధులతో బీసీ వెల్ఫేర్ ఫౌండేషన్, గిరిజన సేవా సదన్ వంటి సంస్థలకు లక్షలాది రూపాయల విరాళాలు అందించారు.
దక్షిణాదిన తమిళనాడులో ఉద్యమం చేసిన పెరియార్‌తో కొండా లక్ష్మణ్ బాపూజీని పోల్చవచ్చు. బాపూజీ స్ఫూర్తితో బీసీల హక్కుల కోసం, చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లు, జనాభా ప్రాతిపదికన కుల గణన, న్యాయ విభాగంలో బీసీ రిజర్వేషన్లు, క్రిమీలేయర్ తొలగింపు వంటి అంశాలపై పోరాటం చేయడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి.
-- సాయిని నరేందర్ న్యాయవాది, రాజకీయ & సామాజిక విశ్లేషకులు, ఫోన్: 9701916091

పోరాట ఘట్టాలు & జీవిత విశేషాలు:
(వ్యాసకర్త: సాయిని నరేందర్ న్యాయవాది, రాజకీయ & సామాజిక విశ్లేషకులు, ఫోన్: 9701916091)