హనుమకొండ(రైట్స్ మీడియా): కాకతీయ విశ్వవిద్యాలయ బయోటెక్నాలజీ విభాగ విశ్రాంత ఆచార్యులు ఆచార్య ఎన్. రామస్వామి నేతృత్వంలో పరిశోధకులు డాక్టర్ విక్రం గొడిశాల, డాక్టర్ రజనీకాంత్ మరక రచించిన “Heat tolerant Transgenic cultivated Tomato” పుస్తకాన్ని బుధవారం విశ్వవిద్యాలయ పరిపాలనా భవనంలోని వైస్‌ఛాన్సలర్ కార్యాలయంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వైస్‌ఛాన్సలర్ ఆచార్య కే. ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే టమాటా రకాల అభివృద్ధికి సంబంధించిన పరిశోధనలు అభినందనీయమన్నారు. ఈ సాంకేతికత ద్వారా రైతులు తమ అవసరాలకు అనుగుణంగా నాట్ల తేదీలను మార్చుకోవడంతో పాటు, అధిక ఉష్ణోగ్రతల కారణంగా టమాటా సాగుకు అనుకూలంగా లేని ప్రాంతాల్లోనూ పంటను సాగు చేసే అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు.
ఈ పరిశోధనలకు కృషి చేసిన ఆచార్య ఎన్. రామస్వామి, డాక్టర్ విక్రం గొడిశాల, డాక్టర్ రజనీకాంత్‌లను అభినందించారు. పుస్తక రచయిత ఆచార్య ఎన్. రామస్వామి మాట్లాడుతూ, వేడిని తట్టుకునే పంటల అభివృద్ధికి ఉపయోగించిన ఈ సాంకేతికతను వేడికి సున్నితమైన ఇతర కూరగాయలు, వరి వంటి పంటలకు కూడా అన్వయించే అవకాశం ఉందన్నారు. ఎల్‌నినో ప్రభావాల నేపథ్యంలో ఉష్ణోగ్రతలను తట్టుకునే పంటల అభివృద్ధికి ఈ పరిశోధనలు ప్రాధాన్యత సంతరించుకుంటాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం, ఓఎస్డీ ఆచార్య బి. వెంకట్రామరెడ్డి, డాక్టర్ బి. రమ, బయోటెక్నాలజీ విభాగాధిపతి డాక్టర్ పి. శ్రీనివాస్, డాక్టర్ టి. శాస్త్రి, డాక్టర్ లక్ష్మణ్, వాగ్దేవి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ. శేషాచలం, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి. హరేందర్ రెడ్డి, డాక్టర్ జి. రాజప్రసాద్, డాక్టర్ బాలరాజు, డాక్టర్ కే. హిమబిందు, డాక్టర్ పి. సురేష్ తదితరులు పాల్గొన్నారు.