అన్యాయాన్ని ప్రశ్నించిన కాళోజి కలం నేటి తరానికి స్ఫూర్తి, కాళోజీ ఒక వ్యక్తి కాదు—ప్రజల గొంతుక అని, కాళోజి కలం అన్యాయాన్ని ప్రశ్నించిందని ప్రజల బాధలను తన బాధలుగా భావించి, సామాజిక చైతన్యాన్ని రగిలించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు” అని కాకతీయ విశ్వవిద్యాలయ వైస్‌ఛాన్సలర్ ఆచార్య కే. ప్రతాప్ రెడ్డి అన్నారు.
బుధవారం కాకతీయ విశ్వవిద్యాలయ పరిపాలన భవన ప్రాంగణంలో నిర్వహించిన ప్రజాకవి, తెలంగాణ వైతాళికుడు కాళోజీ నారాయణరావు 112వ జయంతి సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై బోధన, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. కాళోజీ ఆలోచనలు, సిద్ధాంతాలు కేవలం తెలంగాణ, వరంగల్ ప్రాంతాలకే పరిమితం కాలేదని, ఆయన రచనలు ప్రజల వాణిగా నిలిచాయని వీసీ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమానికి కాళోజీ రచనలు, ఆలోచనలు స్ఫూర్తినిచ్చాయని, ప్రజల పక్షాన నిలిచి అన్యాయాన్ని ప్రశ్నించే ధైర్యం, సామాజిక బాధ్యత, మానవతా దృక్పథాన్ని నేటి తరం కాళోజీ జీవితం నుంచి ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. కాళోజీని స్మరించుకోవడం అంటే కేవలం జయంతి నిర్వహించడం కాదని, ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టడమే నిజమైన నివాళి అని ఆచార్య కే. ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. అంతకు ముందు కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ఆచార్య బి. వెంకట్రామరెడ్డి, పాలక మండలి సభ్యులు ఆచార్య బి. సురేష్ లాల్, డాక్టర్ చిర్రా రాజు, ఆచార్య పి. మల్లారెడ్డి, ఆచార్య జి. హనుమంతు, డాక్టర్ సోమయ్య, డాక్టర్ ఎం. లింగయ్యతో పాటు బోధన, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కాళోజి కలం నేటి తరానికి స్ఫూర్తి
-- కాకతీయ విశ్వవిద్యాలయ వైస్‌ఛాన్సలర్ ఆచార్య కే. ప్రతాప్ రెడ్డి.