కాకతీయ విశ్వవిద్యాలయ స్వర్ణోత్సవాలు, 50వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని విశ్వవిద్యాలయ క్యాంపస్‌లో విస్తృతంగా మొక్కలు నాటారు. విశ్వవిద్యాలయ అవెన్యూ ప్లాంటేషన్ ఇన్‌చార్జి డాక్టర్ బి. వెంకట గోపినాథ్ ఆధ్వర్యంలో పరిపాలనా భవన ప్రాంగణంతో పాటు క్యాంపస్‌లోని వివిధ విభాగాలు, కళాశాలల పరిసరాల్లో 600కు పైగా మొక్కలను నాటారు. పరిపాలనా భవన ప్రాంగణంలో వైస్ ఛాన్సలర్ ఆచార్య కే. ప్రతాప్ రెడ్డి మొక్క నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ మాట్లాడుతూ.. మొక్కలను నాటడమే కాకుండా వాటిని బాధ్యతగా సంరక్షించి, పరిరక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయ క్యాంపస్‌ను మరింత పచ్చదనంతో కూడిన హరిత క్యాంపస్‌గా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా డాక్టర్ బి. వెంకట గోపినాథ్ మాట్లాడుతూ, స్వర్ణోత్సవాల సందర్భంగా క్యాంపస్‌లో 600కు పైగా మొక్కలు నాటినట్లు తెలిపారు. గుల్మోహర్, నేరేడు, ఏలకాయ, బాదం, జువ్వి, వేప, బూరుగు తదితర పలు రకాల వృక్ష జాతులను నాటినట్లు వివరించారు. “స్వర్ణోత్సవాల సందర్భంగా నాటిన ప్రతి మొక్క భవిష్యత్ తరాలకు మనం అందించే పచ్చని కానుక. వాటి సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి” అని వైస్ ఛాన్సలర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా అటవీ శాఖ అధికారి ముకుంద రెడ్డి, విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం, ఓఎస్డీ ఆచార్య బి. వెంకట్రామరెడ్డి, పాలక మండలి సభ్యులు ఆచార్య బి. సురేష్ లాల్, డాక్టర్ బి. రమ, డాక్టర్ ఎన్. సుదర్శన్, డాక్టర్ బి. సుకుమారి, డాక్టర్ చిర్రా రాజు, ఆచార్య మల్లం నవీన్, పుల్లూరు సుధాకర్, కే. అనితా రెడ్డి తదితరులు పాల్గొని మొక్కలు నాటారు. అదేవిధంగా విశ్వవిద్యాలయ డీన్లు, ప్రిన్సిపాళ్లు, విభాగాధిపతులు, ఉద్యోగ సంఘాల బాధ్యులు, పరిశోధకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
కాకతీయ క్యాంపస్ ను హరితవనం గా మార్చాలి : యూనివర్సిటీ వీసి ఆచార్య ప్రతాప్ రెడ్డి