Friday, 18 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
తెలంగాణ

మోడల్ సోలార్ గ్రామంగా చెరువుమాధారం..

చెరువుమాధారంలో గృహాలకు 2 కిలోవాట్ల సోలార్ ప్యానెల్లను ప్రారంభించిన రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి.

మోడల్ సోలార్ గ్రామంగా చెరువుమాధారం..
Share Short Clip Download PDF

జిల్లాలో గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించడంతో పాటు, పేద కుటుంబాల విద్యుత్ అవసరాలను మరింత సమర్థవంతంగా తీర్చే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మోడల్ సోలార్ గ్రామాల కార్యక్రమంలో భాగంగా నేలకొండపల్లి మండలం చెరువుమాధారం గ్రామాన్ని పైలట్ గ్రామంగా అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
బుధవారం చెరువుమాధారం గ్రామంలో గృహాలకు ఏర్పాటు చేసిన 2 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్లను జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన సౌర విద్యుత్ వ్యవస్థను పరిశీలించి, లబ్ధిదారులతో మంత్రి మాట్లాడారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ

ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పేదింటి ఆడబిడ్డలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించాలన్న హామీ మేరకు గృహజ్యోతి పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉచిత విద్యుత్ అందిస్తున్నామని మంత్రి తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉచిత విద్యుత్ పథకంతో ప్రత్యేక అనుబంధం ఉందని, రైతులకు ఉచిత విద్యుత్ అందించిన ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజల సంక్షేమం, రైతుల సంక్షేమం, మహిళల సంక్షేమం, యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు.
చెరువుమాధారం గ్రామాన్ని మోడల్ సోలార్ గ్రామంగా ఎంపిక చేసి జిల్లాలోని ప్రతి నియోజకవర్గం నుంచి ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు క్రింద సోలార్ గ్రామంగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. గ్రామంలోని అర్హత కలిగిన గృహాలకు 2 కిలోవాట్ల సామర్థ్యంతో సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఒక్కో కుటుంబం సాధారణంగా నెలకు 140 నుంచి 150 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగిస్తే, సోలార్ వ్యవస్థ ద్వారా సుమారు 250 నుంచి 270 యూనిట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. కుటుంబం వినియోగించిన తర్వాత మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేసి, నిబంధనల ప్రకారం మిగులు విద్యుత్‌కు సంబంధించిన మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసే విధంగా ఈ పైలట్ ప్రాజెక్టును అమలు చేస్తున్నామని వివరించారు.
గృహాలకే పరిమితం కాకుండా రైతుల వ్యవసాయ మోటార్లకు కూడా సౌర విద్యుత్ అందించే దిశగా చెరువుమాధారాన్ని పైలట్ గ్రామంగా ఎంపిక చేశామని మంత్రి తెలిపారు. 10 హెచ్పి సామర్థ్యం కలిగిన వ్యవసాయ మోటార్లకు సోలార్ విద్యుత్ అందించేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు.
గృహాలకు సౌర విద్యుత్, రైతుల వ్యవసాయ మోటార్లకు సౌర విద్యుత్ అందించడం ద్వారా చెరువుమాధారం గ్రామాన్ని సమగ్ర మోడల్ సోలార్ గ్రామంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.

సోలార్ ప్రాజెక్టుకు దశలవారీగా భారీగా నిధులు వెచ్చిస్తున్నామని, భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా గృహజ్యోతి పథకంతో పాటు రైతులకు కూడా సోలార్ విద్యుత్ అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు. పేదల సంక్షేమం, రైతుల మేలు, మహిళల అభ్యున్నతి, యువత భవిష్యత్తు కోసం ప్రజా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని మంత్రి పేర్కొన్నారు.

జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ మాట్లాడుతూ..

చెరువుమాధారం గ్రామంలో మొత్తం 966 గృహజ్యోతి కనెక్షన్లు ఉన్నాయని, అందులో ప్రాథమికంగా 713 ఇళ్లను మోడల్ సోలార్ గ్రామం పథకం కింద ఎంపిక చేసినట్లు తెలిపారు. సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు అవసరమైన రూఫ్‌టాప్, స్లాబ్ వంటి నిర్మాణ సదుపాయాలను పరిశీలించి ఇళ్లను ఎంపిక చేసినట్లు చెప్పారు. మిగిలిన ఇళ్లలో కూడా అవసరమైన ప్రత్యామ్నాయ నిర్మాణాలపై సాంకేతికంగా పరిశీలించి, సాధ్యమైన మేరకు అందరికీ సోలార్ విద్యుత్ సదుపాయం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.

ప్రతి ఇంటికి ఏర్పాటు చేసిన సోలార్ యూనిట్ ద్వారా సుమారు 250 నుంచి 270 యూనిట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని, గృహజ్యోతి కింద సాధారణంగా 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగం ఉండే కుటుంబాలకు వినియోగం అనంతరం మిగిలే విద్యుత్ గ్రిడ్‌కు చేరేలా వ్యవస్థను రూపొందించినట్లు కలెక్టర్ వివరించారు.

లబ్ధిదారులు సోలార్ ప్యానెళ్లను సక్రమంగా నిర్వహించడం ఎంతో ముఖ్యమని కలెక్టర్ సూచించారు. ప్యానెళ్లపై దుమ్ము, ధూళి పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని, సూర్యరశ్మి సక్రమంగా పడేలా చూసుకోవాలని తెలిపారు. ప్యానెళ్లను శుభ్రం చేసేటప్పుడు కేవలం నీటిని ఉపయోగించాలని సూచించారు. సోలార్ వ్యవస్థల నిర్వహణ, సాంకేతిక అంశాలపై లబ్ధిదారులకు సంబంధిత అధికారులు అవగాహన కల్పిస్తారని, గ్రామంలో అవసరమైన సాంకేతిక సహాయం అందించేందుకు సిబ్బందిని అందుబాటులో ఉంచుతామని కలెక్టర్ తెలిపారు.

సోలార్ కార్యక్రమం ద్వారా చెరువుమాధారం గ్రామం గ్రీన్ ఎనర్జీ వినియోగంలో రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ పేర్కొన్నారు.
అనంతరం మంత్రి బుద్దారం గ్రామంలో రూ. 197 లక్షల వ్యయంతో బుద్దారం నుండి రాజారాంపేట వరకు, కొంగర గ్రామంలో రూ. 105 లక్షల వ్యయంతో కొంగర నుండి పాలేరు వాగు వరకు బిటి రోడ్డు నిర్మాణ పనులకు శంఖుస్థాపనలు చేశారు.
ఈ కార్యక్రమంలో విద్యుత్ ఎస్ఇ శ్రీనివాసా చారి, పీఆర్ ఎస్ఇ వెంకట్ రెడ్డి, ఆర్ అండ్ బి ఎస్ ఇ యుగంధర్ రావు, ఖమ్మం ఆర్డీవో శ్రీనివాస్, నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సీతారాములు, మండల తహసీల్దార్ రాంప్రసాద్, ఎంపిడివో ఎర్రయ్య, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, గ్రామస్థులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.