హైదరాబాద్(రైట్స్ మీడియా): శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు హాజరుకావాల్సిందిగా రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని వివిధ దేవాలయాల అర్చకులు, దేవాదాయ శాఖ అధికారులు ఆహ్వానించారు.

మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం, శ్రీ బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ అమ్మవారి ఆలయం, అమీర్‌పేట శ్రీ కనకదుర్గ ఆలయం అర్చకులు, దేవాదాయ శాఖ అధికారులు శరన్నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు.

ఈ సందర్భంగా అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ను సాదరంగా ఆహ్వానించారు. నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించేందుకు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న ఏర్పాట్లను అధికారులు మంత్రికి వివరించారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానాన్ని స్వీకరించి, అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఉత్సవాలు ప్రశాంతంగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.