హైదరాబాద్ /హనుమకొండ(రైట్స్ మీడియా): రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్యను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా అధిక ప్రమాదాలు చోటుచేసుకుంటున్న 100 జిల్లాలను గుర్తించి ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతోంది. ఇందులో భాగంగా తెలంగాణలో ఏడు జిల్లాలను ఎంపిక చేశారు. ఆయా జిల్లాల్లో ప్రమాదాల కారణాలను విశ్లేషించి, మరణాలను తగ్గించేలా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని డీజీపీ సీవీ ఆనంద్ అధికారులను ఆదేశించారు.
ఈ అంశంపై డీజీపీ సీవీ ఆనంద్ , రవాణాశాఖ కమిషనర్ ఇలంబర్తి సంయుక్తంగా బుధవారం డీజీపీ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో సేఫ్ ఫౌండేషన్ ప్రతినిధులు, ఎంపిక చేసిన ఏడు జిల్లాల కలెక్టర్లు, నాలుగు పోలీస్ కమిషనరేట్ల పోలీసు కమిషనర్లు, సంబంధిత యూనిట్ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఇతర అధికారులు పాల్గొన్నారు.