ధైర్యం, దైవం కలిసి వెలిసిన ప్రాంతం సిరిసిల్ల అని అన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో దైవచింతనతో పాటు, తమ పూర్వీకులు నిజాం రజాకార్లపై చేసిన వీరోచిత పోరాటానికి సిరిసిల్ల ప్రజలు వారసులని పేర్కొన్నారు. సిరిసిల్ల అంటే సిరులకు నిలయమని, అయితే పదేళ్ల టీఆర్ఎస్ హయాంలో సిరిసిల్ల ఉరిసిల్లగా మారిందని అన్నారు. మనిషి నాగరికతకు మొదటి అడుగు వస్త్రమని, వస్త్ర పరిశ్రమకు అసలైన చిరునామా సిరిసిల్ల అని పేర్కొన్నారు. వేలాది కుటుంబాలు వస్త్ర పరిశ్రమను నమ్ముకుని జీవనం సాగిస్తున్నాయని, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన చీరలు, అగ్గిపెట్టెలో పెట్టగలిగేంత సన్నని చీరలను తయారు చేసే నైపుణ్యం ఇక్కడి చేనేత కార్మికుల సొంతమని అన్నారు.
2009 నుంచి 2023 వరకు అరడజను సార్లు జరిగిన ఎన్నికల్లో కేటీఆర్ గెలిచినప్పటికీ చేనేత కార్మికుల ఆత్మహత్యలను ఎందుకు ఆపలేదని, కార్మికుల గల్ఫ్ వలసలు ఎందుకు ఆగలేదని ప్రజలు ఆలోచించాలని అన్నారు. గల్ఫ్ దేశాలకు వెళ్లిన కార్మికులు ప్రమాదవశాత్తు మరణించినప్పుడు కనీసం వారి మృతదేహాలను స్వస్థలాలకు తీసుకురాలేని పరిస్థితి గత పాలనలో ఉండేదని అన్నారు.
గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక పాలసీ రూపొందించాలని స్థానిక నాయకులు కోరగా, విదేశాల్లో ప్రమాదవశాత్తు కార్మికులు మరణిస్తే మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకురావడంతో పాటు సంబంధిత కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించేలా ప్రజా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ముఖ్యమంత్రి తెలిపారు.
2004, 2006, 2008 సంవత్సరాల్లో మూడుసార్లు కరీంనగర్ జిల్లా ప్రజలు కేసీఆర్‌ను ఎంపీగా గెలిపించినప్పటికీ 2009లో కేసీఆర్ పాలమూరుకు వలస వెళ్లారని అన్నారు. గత పాలకులపై అవినీతి ఆరోపణలు చేస్తూ, కల్వకుంట్ల కుటుంబం లక్ష కోట్ల అవినీతికి పాల్పడిందని ముఖ్యమంత్రి ఆరోపించారు. అమెరికాలో ఎన్ని బాత్రూంలు కడిగారో, వేల కోట్లు ఎలా సంపాదించారో కేటీఆర్ వెల్లడించాలని అన్నారు.
గోదావరి జలాలను అడ్డం పెట్టుకుని మానేరు ఇసుకను దోచుకున్నారని ఆరోపిస్తూ, నేరెళ్ల బాధితులు ఇందుకు సజీవ సాక్ష్యమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్‌ను ఇక్కడికి తీసుకువస్తే పోలీసులు నిర్బంధించిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. మిడ్‌మానేరు డ్యాం ముంపులో ఇళ్లు కోల్పోయిన కేసీఆర్ కుటుంబ సభ్యులు ఇళ్ల స్థలాలు పొందలేదా అని ప్రశ్నించారు. సిరిసిల్ల ప్రజల ఓట్లు కేటీఆర్‌కు పచ్చనోట్లుగా మారాయని ఆరోపించారు. వేములవాడ శివయ్య, భద్రాచలం రామయ్యను మోసం చేసిన వ్యక్తి కేసీఆర్ ఒక్కరేనని వ్యాఖ్యానించారు.
వెయ్యి రోజుల ప్రజాపాలనలో నేత కార్మికుల కోసం రూ.1,741 కోట్లు ఖర్చు చేశామని, రాజన్న సిరిసిల్ల జిల్లాకు రూ.1,700 కోట్ల నిధులు మంజూరు చేశామని తెలిపారు. వేములవాడలో నూలు డిపో ఏర్పాటు చేశామని, వేములవాడ ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకున్నామని అన్నారు.
ఎమ్మార్వో కార్యాలయం, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం, మహిళా పోలీస్ స్టేషన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సిరిసిల్లలో మార్పు రాబోతోందని, ప్రజల కలలో ఆనందం కనిపిస్తుందని అన్నారు. రాబోయే శాసనమండలి ఎన్నికల్లో ఒక పద్మశాలి బిడ్డను శాసనమండలికి పంపించాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన అభ్యర్థికి మంత్రి వర్గంలో స్థానం కల్పిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.
మానేరు నదిపై నిర్మించిన చెక్‌డ్యాంలు కొట్టుకుపోయి కేసీఆర్ ఇంట్లో నోట్ల కట్టలుగా తేలాయని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీలు 9, 10, 11, 12 పూర్తి చేయకుండా పెండింగ్‌లో పెట్టడం వల్ల ఇక్కడి రైతులకు గోదావరి జలాలు చేరలేదని అన్నారు. కుటుంబ పాలన కావాలో, ప్రజాపాలన కావాలో ప్రజలు ఆలోచించుకోవాలని అన్నారు. గత పాలకులు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించారా అని ప్రశ్నించారు. పదేళ్ల సమయం పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించేందుకు సరిపోలేదా అని అన్నారు. గత పాలకులు పేదలకు రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదని, బతుకమ్మ చీరల్లో కమిషన్లు కొట్టేశారని ఆరోపించారు. బతుకమ్మ చీరలకు సంబంధించిన రూ.350 కోట్ల బకాయిలను ప్రజా ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు.
రేషన్ కార్డులు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్నబియ్యం వంటి పథకాలను గత పాలకులు అమలు చేయలేదని అన్నారు. ప్రస్తుతం కోటి ఆరు లక్షల కుటుంబాలకు చెందిన 3 కోట్ల 46 లక్షల మంది లబ్ధిదారులకు రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం సరఫరా చేస్తున్నామని తెలిపారు.
ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారని, మహిళల ఉచిత బస్సు ప్రయాణం కోసం ప్రభుత్వం రూ.12 వేల కోట్లు చెల్లించిందని అన్నారు. ఈ పండుగకు ప్రభుత్వం చిలక చీరలను పంపిణీ చేస్తుందని తెలిపారు.
రైతు భరోసా కింద రూ.36 వేల కోట్లు, రుణమాఫీ కింద రూ.20,614 కోట్లు రైతులకు చెల్లించామని తెలిపారు. 75 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తున్నామని, రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలు చెల్లించామని పేర్కొన్నారు.
నేటి పాలనలో శ్రీకాంతాచారి తల్లిని మహిళా కమిషన్ సభ్యురాలిగా, చాకలి ఐలమ్మ కుటుంబ సభ్యులను మహిళా కమిషన్ సభ్యులుగా నియమించామని ముఖ్యమంత్రి తెలిపారు.