హనుమకొండ (రైట్స్ మీడియా): మానవ జీవన శ్రేయస్సు, అభివృద్ధి శాస్త్ర, సాంకేతిక విజ్ఞానంతోనే సాధ్యమవుతుందని కాకతీయ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కే. ప్రతాప్ రెడ్డి అన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయ సెనేట్ హాల్లో అక్టోబర్ 7, 8 తేదీల్లో నిర్వహిస్తున్న రెండు రోజుల జాతీయ సదస్సు “Modern Biotechnology: Challenges and Opportunities” ప్రారంభ సమావేశం బుధవారం జరిగింది. బయోటెక్నాలజీ విభాగాధిపతి డాక్టర్ టి. శాస్త్రి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వీసీ విద్యార్థులు, పరిశోధకులు, బోధనా సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు. శాస్త్ర, సాంకేతిక రంగాల ద్వారా వ్యాధుల నివారణ, నియంత్రణ సాధ్యమవుతుందని ఆయన అన్నారు. బయోటెక్నాలజీ కేవలం ఆహారం, ఆరోగ్యం, పర్యావరణం, సుస్థిర అభివృద్ధికే పరిమితం కాకుండా, భవిష్యత్‌లో మానవ మనుగడకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. కోవిడ్–19 మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా అన్ని వ్యవస్థలను ప్రభావితం చేసిందని గుర్తుచేశారు. రానున్న మూడు దశాబ్దాల్లో ఆర్థికాభివృద్ధి, ఉపాధి అవకాశాల పెంపులో బయోటెక్నాలజీ రంగం కీలకంగా మారుతుందని వీసీ అన్నారు.
తెలంగాణలో శిక్షణ పొందిన నిపుణుల అవసరం పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల సిలబస్‌ను ప్రాజెక్ట్ ఆధారిత, సాంకేతికత ఆధారిత అభ్యసనంతో అనుసంధానం చేస్తున్నామని తెలిపారు. బయోటెక్నాలజీ రంగంలో ఎంటర్ప్రెన్యూర్షిప్కు విస్తృత అవకాశాలు ఉన్నాయని, తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన “Life Sciences Policy 2030” కూడా ఈ రంగానికి ప్రాధాన్యతనిస్తోందని అన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో రూసా నిధులతో బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, ఫార్మసీ విభాగాలకు అవసరమైన మౌలిక వసతులు, అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించినట్లు తెలిపారు. కే-హబ్ ద్వారా విద్యార్థులకు పెద్దఎత్తున శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
సదస్సులో కీలక ఉపన్యాసం చేసిన కాకతీయ విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థి, మైసూరులోని Central Food Technological Research Institute (CFTRI) డైరెక్టర్ డాక్టర్ గిరిధర్ పర్వతం మాట్లాడుతూ, కాకతీయ విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థిగా తాను గర్విస్తున్నానని, తనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశంలో పరిశోధన, అభివృద్ధి పెద్దఎత్తున జరుగుతున్నప్పటికీ, వాటి ద్వారా ఉద్యోగిత కూడా పెరగాల్సిన అవసరం ఉందన్నారు. గత రెండు దశాబ్దాల్లో దేశంలో గణనీయమైన ఆవిష్కరణలు జరిగాయని, ఇకపై సృజనాత్మకతను మరింత పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. తమకు లభించే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బయోటెక్నాలజీ కేవలం వైద్య, ఫార్మా, వ్యవసాయ రంగాలకే పరిమితం కాదని, అనేక ఇతర రంగాల్లోనూ విస్తృత అవకాశాలు ఉన్నాయని అన్నారు. తాను విశ్వవిద్యాలయ స్కాలర్షిప్ సహాయంతో ఉన్నత విద్యను కొనసాగించి ఈ స్థాయికి చేరుకున్నానని గుర్తుచేశారు. విద్యార్థులు అకడమిక్ దృక్పథంతో పాటు పరిశోధన, సృజనాత్మకతపై దృష్టి సారించాలని సూచించారు.
కేయూ రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం మాట్లాడుతూ, విశ్వవిద్యాలయ అభివృద్ధిలో గత ఉపకులపతులు, ఆచార్యులు చేసిన కృషి ఎంతో విశిష్టమైనదని అన్నారు. బయోటెక్నాలజీ రంగంలో నూతన పరిశోధనలు కొత్త పుంతలు తొక్కుతున్నాయని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయ బయోటెక్నాలజీ విభాగం రజతోత్సవ సంవత్సరంలోకి అడుగుపెట్టడం, కేయూ స్వర్ణోత్సవ వేడుకల్లో భాగం కావడం అభినందనీయమన్నారు. ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా పరిశోధకులు, శాస్త్రవేత్తల నుంచి పెద్ద సంఖ్యలో పరిశోధనా పత్రాలు రావడం సంతోషకరమని తెలిపారు.
సదస్సు అధ్యక్షులు, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ టి. శాస్త్రి మాట్లాడుతూ, రెండు రోజుల జాతీయ సదస్సులో ఐదు ప్లీనరీ సెషన్లు, పోస్టర్ ప్రెజెంటేషన్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సదస్సుకు సంబంధించిన పరిశోధనా పత్రాల సంక్షిప్త వివరాలతో కూడిన అబ్స్ట్రాక్ట్లను కూడా విడుదల చేసినట్లు చెప్పారు. కన్వీనర్ డాక్టర్ పి. శ్రీనివాస్ మాట్లాడుతూ, బయోటెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో 2010, 2016, 2023 సంవత్సరాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయి సదస్సులు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఆచార్యులు, బోధనా, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.