హుజురాబాద్ మండలంలోని చెల్పూర్ గ్రామంలో 'జయహో యూత్' ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం గ్రామంలో మహా కుంకుమ పూజ, అలాగే భారీ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు.
వేద పండితులు రాంబాబు ఆచార్యుల పర్యవేక్షణలో, వేద మంత్రోచ్ఛారణల మధ్య మహిళలు భక్తిశ్రద్ధలతో కుంకుమ పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు, గ్రామస్తులు తరలిరావడంతో ఈ పూజా కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.
ఈ వేడుకల్లో చెల్పూర్ గ్రామ సర్పంచ్ వంతడుపుల కస్తూరి కుటుంబ సమేతంగా పాల్గొని విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామ ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని, రైతుల పంటలు సమృద్ధిగా పండి సిరిసంపదలు చేకూరాలని, చెల్పూర్ గ్రామం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. అనంతరం సర్పంచ్ కస్తూరి ఆధ్వర్యంలో భక్తులకు, గ్రామ ప్రజలకు భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు.
ఈ విశేష కార్యక్రమం అనంతరం, జయహో యూత్ కమిటీ సభ్యులు గౌరవ సర్పంచ్ వంతడుపుల కస్తూరి కుటుంబాన్ని శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో యూత్ కమిటీ సభ్యులు రామునాజన్, కార్తీక్, రామ్ లక్ష్మణ్, నరేందర్, ప్రేమ్ కుమార్, అనిల్, నిఖిల్, ఆదిత్య, ఉమేష్, నాగులు, శ్రీకాంత్, యుగేందర్ తదితరులు చురుగ్గా పాల్గొన్నారు.