స్పష్టమైన లక్ష్యంతో, ఏకాగ్రతతో చదివితే పోటీ పరీక్షల్లో విజయం సాధించడం సులభమని కేయూ(కాకతీయ యూనివర్సిటీ) రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి. రామచంద్రం అన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్టడీ సెంటర్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న ఎస్‌ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచితంగా ‘కరెంట్ అఫైర్స్’ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరై అభ్యర్థులకు పుస్తకాలను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ, పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు క్రమశిక్షణ, సమయపాలన, ఏకాగ్రత ఎంతో కీలకమన్నారు. రాబోయే మూడు నెలలు మొబైల్ ఫోన్ వినియోగాన్ని తగ్గించి, చదువుపైనే పూర్తి దృష్టి సారించాలని సూచించారు. నేటి కష్టమే రేపటి విజయానికి పునాది అని, ఆత్మవిశ్వాసంతో లక్ష్య సాధనకు కృషి చేయాలని అభ్యర్థులకు సూచించారు. కార్యక్రమంలో పుస్తక దాత పి. విష్ణు, స్టడీ సెంటర్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ పుల్లా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఏకాగ్రతతో చదివితే లక్ష్య సాధన సులభం: కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి. రామచంద్రం