Friday, 25 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
క్రైమ్ న్యూస్

తమ్ముడిని కత్తితో పొడిచి చంపిన అన్న... అరెస్ట్ చేసిన పోలీసులు

తమ్ముడిని కత్తితో పొడిచి చంపిన అన్న... అరెస్ట్ చేసిన పోలీసులు
Share Short Clip Download PDF

ఇటీవల గరీబ్‌నగర్‌లో జరిగిన సంచలనాత్మక హత్య కేసును గీసుగొండ పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. తన తమ్ముడిని దారుణంగా హత్య చేసిన అన్న ఎలుబాక ప్రవీణ్ (33)ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు మామునూరు ఏసీపీ ఎన్. వెంకటేష్ ఒక ప్రకటనలో తెలిపారు.

పోలీసులు తెలిపిన కేసు వివరాలు:

ఈ నెల 19న రాత్రి గరీబ్‌నగర్‌లోని అద్దె ఇంట్లో ఎలుబాక ప్రసాద్ (31) కత్తిపోట్లకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లి ఎలుబాక సుజాత ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ప్రవీణ్ తరచుగా తల్లిని డబ్బులు అడిగేవాడని, ఈ విషయంలో తమ్ముడు ప్రసాద్ మందలించడంతో అతనిపై కక్ష పెంచుకున్నాడు. తల్లి సంపాదన అంతా తనకే దక్కాలనే దురుద్దేశంతో తమ్ముడిని అంతమొందించాలని పథకం పన్నాడు.
19న రాత్రి తల్లి నైట్ డ్యూటీకి వెళ్లడంతో ప్రసాద్ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయం చూసి, స్వయంగా తయారు చేసుకున్న కత్తితో ప్రవీణ్ దాడి చేశాడు. వీపు, ఛాతి, భుజంపై తీవ్రంగా పొడవడంతో ప్రసాద్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. దాడి సమయంలో ప్రవీణ్ ఎడమ బొటనవేలికి కూడా గాయమైంది. అనంతరం తల్లిని కూడా బెదిరించిన నిందితుడు, ఆర్ఎంపీ వద్ద చికిత్స పొంది పరారయ్యాడు.

ఆధారాలు స్వాధీనం – రిమాండ్:

పక్కా సమాచారంతో ఈ నెల 21న నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతడు ఇచ్చిన వివరాల ఆధారంగా పొదల్లో దాచిన హత్యకు ఉపయోగించిన కత్తి, రక్తపు మరకలున్న దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరించి, నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.

అభినందించిన మామునూర్ ఏసిపి..

కేసును వేగంగా ఛేదించిన గీసుగొండ ఇన్‌స్పెక్టర్ విశ్వేశ్వర్, ఎస్‌ఐలు అనిల్ కుమార్, కుమార్ సిబ్బందిని ఏసీపీ అభినందించారు.