దామాషా ప్రకారం ప్రభుత్వ ఫలాలు సంపూర్ణంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అందాలని, ఈ దిశగా అధికారులు కృషి చేయాలని రాష్ట్ర షెడ్యూల్ కులాల, షెడ్యూల్ తెగల కమీషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కమీషన్ సభ్యులు కుస్రం నీలాదేవి, రాంబాబు నాయక్, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, పోలీస్ కమీషనర్ సునీల్ దత్ లతో కలిసి భూమి, సర్వీసెస్, అట్రాసిటీ కేసులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల వారీగా ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల వివరాలు, ఎస్సీ, ఎస్టీ ల కోసం పథకాల అమలు, అట్రాసిటీ కేసుల పురోగతిపై సమీక్షించారు.
ప్రభుత్వ ఫలాలు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు దామాషా ప్రకారం సంపూర్ణంగా అందాలి..
• తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులాల, షెడ్యూల్ తెగల కమీషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య.
• ప్రతి నెల చివరి వారంలో సివిల్ రైట్స్ డే ని పకడ్బందీగా నిర్వహించాలి | గురుకులాల్లో మౌళిక వసతులు కల్పించాలి | పారిశుద్ధ్య కార్మికులకు కోటి రూపాయల భీమా కల్పించాలి | జిల్లాలోని అన్ని అంగన్వాడీలకు స్వంత భవనాలు నిర్మించాలి | ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు వారి ప్రాంతాల్లోనే ఖర్చు చేయాలి
• ఎస్సీ, ఎస్టీ కమీషన్ సభ్యులు కుస్రం నీలాదేవి, రాంబాబు నాయక్, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, పోలీస్ కమీషనర్ సునీల్ దత్ లతో కలిసి, అధికారులతో భూమి, సర్వీసెస్, అట్రాసిటీ కేసులపై సమీక్ష నిర్వహించిన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్.
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ,
ఎస్సీ, ఎస్టీ యువతకు స్వయం ఉపాధి, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పించే రాజీవ్ యువ వికాసం కార్యక్రమాన్ని వచ్చే నవంబర్ మాసంలో ప్రభుత్వం ప్రారంభించనున్నట్లు తెలిపారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అంగన్వాడీ కేంద్రాల భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. మండల పరిషత్ కార్యాలయాల్లో నిర్వహించే జనరల్ బాడీ సమావేశాల్లో అంగన్వాడీ భవనాల స్థల సేకరణ, నిర్మాణాల విషయమై చర్యలు వేగవంతం చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులు, నాణ్యమైన సౌకర్యాలను కల్పించాలని తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద కేటాయించిన నిధులను తప్పనిసరిగా ఆయా వర్గాల నివాస ప్రాంతాలు, తండాలు, కాలనీల అభివృద్ధికి మాత్రమే వినియోగించాలని స్పష్టం చేశారు. పంచాయతీ రాజ్, మున్సిపాలిటీ శాఖల పరిధిలోని సానిటేషన్ వర్కర్లందరికీ మెరుగైన సామాజిక భద్రత, సురక్షిత పని వాతావరణం కల్పించే చర్యలను తక్షణమే అమలు చేయాలన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు కోటి రూపాయల భీమా కల్పించాలన్నారు. కుల ధ్రువీకరణ పత్రాల దరఖాస్తులు పెండింగ్ లేకుండా చూడాలన్నారు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణ త్వరగా పూర్తి చేసి బాధితులకు పరిహారం, న్యాయం అందించాలన్నారు. ప్రతి నెల చివరి వారంలో నిర్వహించే 'సివిల్ రైట్స్ డే' కార్యక్రమాల్లో తహశీల్దార్లు, స్టేషన్ హౌజ్ అధికారి స్థాయి అధికారులు తప్పనిసరిగా పాల్గొనెలా చూడాలన్నారు. ప్రజల్లో మూఢ నమ్మకాలు, చట్టాలపై అవగాహన కల్పించాలని, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రభుత్వం అందించే సంక్షేమ, అభివృద్ధి పథకాలపై చైతన్యం తేవాలన్నారు. జిల్లాలో అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమానికి కృషి చేయాలని చైర్మన్ సూచించారు.
మంగళవారం జరగనున్న హైకోర్టు కమిటీ మీటింగ్ దృష్ట్యా, ఎస్సీ/ఎస్టీ అట్రోసిటీ కేసుల పెండింగ్ బకాయిలు, ఇంటర్-కాస్ట్ మ్యారేజెస్ ప్రోత్సాహకాలు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని కమిషన్‌కు సమర్పించాలన్నారు.
సమీక్షలో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ,
ఏ అంగన్‌వాడీ కేంద్రం ప్రైవేట్ భవనాల్లో ఉండకూడదనే లక్ష్యంతో స్వంత భవనాల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నామన్నారు. మహిళల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు జిల్లాలో దాదాపు 494 విలేజ్ ఆర్గనైజేషన్ భవనాల నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నామని తెలిపారు.
ప్రభుత్వం నిర్దేశించిన కోటా ప్రకారం అర్హులైన ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు ఇళ్ల కేటాయింపులో సంపూర్ణ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలోని 19 సంక్షేమ పాఠశాలలు ప్రైవేట్ భవనాల్లో కొనసాగుతున్నందున, వాటికి మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేశామని తెలిపారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ కింద ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున లభించిన 5 స్కూళ్లకు మ్యాపింగ్ చేసి, ప్రైవేట్/శిథిలావస్థలో ఉన్న హాస్టళ్ల విద్యార్థులను ప్రాధాన్యత ప్రకారం ఇక్కడికి తరలిస్తామని అన్నారు. బోనకల్, రఘునాథపాలెంలలోని స్కూళ్లు వచ్చే విద్యాసంవత్సరం నాటికి, మిగిలినవి వచ్చే ఏడాది డిసెంబర్/జనవరి నాటికి అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
జిల్లాలో 797 కేసుల్లో 930 బాధితులకు 12 కోట్ల 42 లక్షల 50 వేల పరిహారం మంజూరు కాగా, 9 కోట్ల 5 లక్షలు అందజేసినట్లు, మిగతా నిధులు అందగానే చెల్లించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగానికి విలువైన సూచనలు, సలహాలు అందించిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్‌పర్సన్, సభ్యులకు జిల్లా యంత్రాంగం తరఫున ధన్యవాదాలు తెలిపారు.
సమీక్షలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ,
జిల్లాలో 2017 నుండి ఇప్పటి వరకు 878 ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు అయ్యాయన్నారు. ఇందులో 194 ఫాల్స్ కేసులు కాగా, 684 కేసుల్లో 653 కేసులకు ఛార్జ్ షీట్ దాఖలు, 8 కేసులకు శిక్షలు పడగా మిగతా కేసులు వివిధ స్థాయిల్లో ఉన్నాయన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా, పరిహారం పొందేలా విచారణ చేస్తున్నట్లు తెలిపారు.
ఈ సమీక్షలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, శిక్షణ సహాయ కలెక్టర్ పారస్ కుమార్, కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, కమిటీ అనధికార సభ్యులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఏసీపీలు, ఎంపిడిఓ లు, మునిసిపల్ కమీషనర్లు, తహశీల్దార్లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.