Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
రాష్ట్రాలు

ప్రజాస్వామ్య పరిరక్షణకు పోరాటం.. ఓటు హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదీ

⏩లోక్‌భవన్ ముట్టడి–నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ప్రజాస్వామ్య పరిరక్షణకు పోరాటం.. ఓటు హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదీ
Share Short Clip Download PDF

హైదరాబాద్(రైట్స్ మీడియా): దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను, రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును పరిరక్షించేందుకు కాంగ్రెస్‌ పార్టీ, ఇండియా కూటమి చేపడుతున్న పోరాటానికి ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా ఒక దేశ పౌరులు గా తీసుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో నెలకొంటున్న అనుమానాలకు కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం స్పష్టమైన సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ పిలుపు మేరకు గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన లోక్‌భవన్ ముట్టడి–నిరసన కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల నాయకులు, కార్యకర్తలతో కలిసి లోక్‌భవన్ వైపు నిర్వహించిన నిరసన ర్యాలీలో ఆయన పాల్గొని ప్రజాస్వామ్య పరిరక్షణకు తమ సంఘీభావాన్ని తెలిపారు.

ఎన్నికల వ్యవస్థపై అనుమానాలకు సమాధానం చెప్పాలి

ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పునాది వంటివని మంత్రి అడ్లూరి అభివర్ణించారు.. ప్రజల ఓటు హక్కుకు సంబంధించిన అంశాల్లో పారదర్శకత, జవాబుదారీతనం అత్యంత కీలకమని చెప్పారు. ఓటర్ల జాబితాల సవరణ, ఓట్ల తొలగింపు వంటి అంశాలపై ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘంపై ఉందన్నారు. ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగబద్ధ సంస్థలపై ప్రజలకు నమ్మకం ఉండటం ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యవసరమని, ఆ నమ్మకానికి ఎలాంటి విఘాతం కలగకుండా వ్యవహరించాల్సిన బాధ్యత సంబంధిత సంస్థలపై ఉందని తెలిపారు. ప్రజాస్వామ్య పద్ధతిలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న ప్రతిపక్ష నాయకులపై కఠిన చర్యలకు దిగడం సరికాదని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల తరఫున ప్రశ్నలు లేవనెత్తుతున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితర నాయకులపై పోలీసులు , కేంద్ర ప్రభుత్వ తీరు పట్ల ఆయన మండిపడ్డారు.

ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ఎన్నికల వ్యవస్థలో జరుగుతున్న పరిణామాలపై వివరణ కోరడం ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు ఉన్న హక్కు అని అన్నారు. ప్రశ్నించే గొంతులను అణచివేయడం ద్వారా ప్రజల్లో ఉన్న అనుమానాలను మరింత పెంచినట్లవుతుందని ఆయన పేర్కొన్నారు.

ఎన్నికల వ్యవస్థపై అనుమానాలకు సమాధానం చెప్పాలి

ఓటు హక్కుపై రాజీ లేదు

భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన ఓటు హక్కును కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలు తమ ఓటుతో ప్రభుత్వాలను ఎన్నుకునే హక్కును ఎట్టి పరిస్థితుల్లోనూ బలహీనపరచకూడదన్నారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో నమ్మకం పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాలని, ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న అంశాలపై సమగ్ర వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య సంస్థలు స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా పనిచేస్తున్నాయనే విశ్వాసం ప్రజల్లో మరింత బలపడాల్సిన అవసరం ఉందన్నారు.

రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల కాపాడటం కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రజల పక్షాన నిలుస్తుందని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఇది కేవలం రాజకీయ పార్టీలకు సంబంధించిన అంశం కాదని, దేశంలోని ప్రతి పౌరుడి హక్కులకు సంబంధించిన విషయమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి ఇండియా కూటమి పార్టీలతో కలిసి కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని తెలిపారు.

ప్రజల ఓటు విలువను కాపాడే విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడేందుకు అవసరమైన ప్రతి ప్రజాస్వామ్య మార్గంలో పోరాటాన్ని కొనసాగిస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు.