Thursday, 05 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
రాష్ట్రాలు

సూపర్‌ ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రజలంతా సమష్టిగా కృషి చేయాలి

⏩విద్యుత్‌ డిమాండ్‌ 20 వేల మెగావాట్లకు పైగా పెరిగినా కోతలు లేకుండా నిరంతరాయ సరఫరా

సూపర్‌ ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రజలంతా సమష్టిగా కృషి చేయాలి
Share Short Clip Download PDF

⏩నీటిని సంరక్షిస్తూ త్రాగునీటికి ప్రాధాన్యమివ్వాలి..నీటి సంరక్షణ పనులతో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనకు చర్యలు

⏩సూపర్‌ ఎల్‌నినో సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పనిచేయాలి

రానున్న 10 నెలల పాటు మనుషులు, పశువుల త్రాగునీటి అవసరాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

చింతకాని/ఖమ్మం, అక్టోబర్- 24(రైట్స్ మీడియా): సూపర్‌ ఎల్‌నినో ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా సుమారు 150 దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, రానున్న రోజుల్లో తలెత్తే కరువు పరిస్థితు లను ఎదుర్కొనేందుకు ప్రజలంతా సమష్టిగా కృషి చేయాలని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.

శనివారం ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్‌, ఎన్పీడీసీఎల్‌ సీఎండీ వరుణ్ రెడ్డితో కలిసి విస్తృతంగా పర్యటించిన అనంతరం కొదుమూరు గ్రామంలో డిప్యూటీ సిఎం మీడియా సమావేశం నిర్వహించారు.

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ

సూపర్‌ ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపడుతోందని తెలిపారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని, దీంతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొద్దిపాటి నీరు ఆవిరైపోవడంతో పాటు భూగర్భ జలాలు మరింత తగ్గిపోయే ప్రమాదం ఉందని అన్నారు. రాబోయే 10 నెలల పాటు మనుషులు, పశువుల త్రాగునీటి అవసరాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అందుబాటులో ఉన్న నీటి వనరులను కాపాడుకోవాలని సూచించారు.

రాష్ట్రంలోని 44 వేల చెరువుల్లో సుమారు 40 శాతం చెరువుల్లో కనీసం పావు వంతు కంటే తక్కువ నీరు ఉందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కరువు పరిస్థితు లను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలను ప్రజలు, రైతులు పాటిస్తూ ప్రభుత్వానికి సంపూర్ణంగా సహకరించాలని కోరారు.

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ

విద్యుత్‌ డిమాండ్‌ పెరిగినా కోతలు లేకుండా సరఫరా:

రాష్ట్రంలో విద్యుత్‌ అవసరాలు గణనీయంగా పెరుగుతున్నప్పటికీ అన్ని వర్గాల ప్రజలకు నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు. 2014లో రాష్ట్రంలో గరిష్ఠ విద్యుత్‌ డిమాండ్‌ 6,648 మెగావాట్లు ఉండగా, 2023లో 15,497 మెగావాట్లకు చేరిందని, ప్రస్తుతం 20 వేల మెగావాట్లకు పైగా డిమాండ్‌ నమోదవుతోందని వివరించారు.

గృహ అవసరాలు, వ్యవసాయ పంపుసెట్లు, ఎత్తిపోతల పథకాల వినియోగం పెరగడంతో విద్యుత్‌ డిమాండ్‌ అధికమవుతోందని తెలిపారు. గత సంవత్సరం అక్టోబర్ నెలలో రోజుకు 245 మిలియన్ యూనిట్ల విద్యుత్తు అవసరం వస్తే, ప్రస్తుతం రోజుకు 335 మిలియన్ యూనిట్ల, దాదాపు 37 శాతం అధికంగా డిమాండ్ పెరిగిందని అన్నారు.  

డిమాండ్‌ పెరుగుదలను ముందుగానే అంచనా వేసి, నిపుణులతో చర్చించి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవడం వల్ల విద్యుత్‌ కోతలు లేకుండా సరఫరా చేయగలుగుతున్నామని తెలిపారు. అక్టోబర్‌ నెలలో విద్యుత్‌ అవసరాలు అధికంగా పెరిగినప్పటికీ కోతలు లేకుండా సరఫరా చేస్తున్నామని అన్నారు. ఒకవైపు విద్యుత్‌ డిమాండ్‌ పెరుగుతూ, మరోవైపు జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గడంతో జలవిద్యుత్‌ ఉత్పత్తి అవకాశాలు తగ్గుతున్నాయని వివరించారు.

సబ్‌స్టేషన్ల నిర్మాణానికి ప్రత్యేక చర్యలు:

విద్యుత్‌ సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ఎన్పీడీసీఎల్‌, ఎస్పీడీసీఎల్‌ పరిధిలో కొత్తగా 680 సబ్‌స్టేషన్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయగా, 177 సబ్‌స్టేషన్ల నిర్మాణం పూర్తయిందని డిప్యూటీ సీఎం తెలిపారు. ట్రాన్స్‌కో పరిధిలో 24 సబ్‌ స్టేషన్లకు అనుమతులు మంజూరు చేయగా, 11 సబ్‌స్టేషన్ల నిర్మాణం పూర్తయిందని వివరించారు.

పంపుసెట్ల వినియోగంలో జాగ్రత్తలు పాటించాలి:

రాష్ట్రంలో సుమారు 30 లక్షల వ్యవసాయ పంపుసెట్లు ఉండగా, వాటిలో దాదాపు 15 లక్షల పంపుసెట్లు భూగర్భ జలాలు తగ్గిపోవడంతో ప్రభావితమయ్యాయని డిప్యూటీ సీఎం తెలిపారు. నీరు లేకున్నా మోటార్లు నడపడం, ఒకేసారి అధిక విద్యుత్‌ లోడ్‌ పడటం వల్ల కొన్ని ప్రాంతాల్లో మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నా యని చెప్పారు. భూగర్భ జలాలు అందుబాటులో లేనప్పుడు మోటార్లు ఆన్‌ చేయవద్దని, పంపుసెట్లకు అమర్చిన ఆటో స్టార్టర్లను తొలగించాలని రైతులకు సూచించారు. విద్యుత్‌ వినియోగంలో అప్రమత్తంగా ఉండటంతో పాటు నీటిని పొదుపుగా వినియోగించాలని కోరారు.

53 లక్షల కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ పథకం క్రింద ఇప్పటి వరకు ప్రభుత్వం పేద కుటుంబాల తరఫున డిస్కంలకు రూ.5,000 కోట్లు చెల్లించిందన్నారు. వ్యవసాయ పంపు సెట్లకు ఉచిత విద్యుత్ సరఫరా కోసం ప్రభుత్వం ఏటా సుమారు రూ.14 వేల కోట్లు డిస్కంలకు చెల్లిస్తోందని వివరించారు.

గ్రామాల వారీగా వ్యవసాయ పరిస్థితులపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని పంటల సాగుపై రైతులకు తగిన సూచనలు అందించాలని తెలిపారు.

పంపుసెట్ల వినియోగంలో జాగ్రత్తలు పాటించాలి:

ఉపాధి హామీ పనులతో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన:

కరువు పరిస్థితుల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు ఉపాధి కల్పించేందుకు ఉపాధి హామీ పథకం క్రింద పెద్ద ఎత్తున పనులు చేపట్టనున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. ప్రతి గ్రామంలో అవసరమైన పనులను గుర్తించి అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అవసరమైన మేరకు నిధులు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.

ప్రస్తుతం వీబీ-జీ రామ్‌ జీ పథకం క్రింద రాష్ట్రంపై 40 శాతం నిధుల భారం ఉన్నప్పటికీ, కేంద్రం మంజూరు చేసిన 9 లక్షల పనులతో పాటు మరో 8 లక్షల పనులను గుర్తించేందుకు కార్యాచరణ చేపట్టామని తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లో నీటి సంరక్షణకు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. ఇంకుడు గుంతలు, ఫామ్‌ పాండ్లు, బోర్‌ రీఛార్జ్‌ పిట్లు, పశువుల షెడ్లు, నీటి తొట్టెలు, రోడ్ల నిర్మాణం వంటి పనులను గుర్తించి ఉపాధి హామీ పథకం క్రింద చేపడతామని తెలిపారు. కాలువలను శుభ్రం చేయడం, చెరువుల్లో పూడికతీత వంటి పనుల ద్వారా నీటి సంరక్షణతో పాటు గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు.

రాజకీయాలకు ఇది సమయం కాదు.. ప్రజలను కాపాడుకోవడమే లక్ష్యం:

సూపర్‌ ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే పరిస్థితులను ఎదుర్కోవడంలో రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పనిచేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఇది రాజకీయాలు చేయాల్సిన సమయం కాదని, ప్రజలను ఈ సంక్షోభం నుంచి కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. ప్రజలందరూ నీటిని, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలని, ప్రభుత్వ చర్యలకు సహకరించాలని కోరారు.

గ్రామాల వారీగా ప్రజలకు అవగాహన కల్పించి, నీటి సంరక్షణతో పాటు అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

ఈ మీడియా సమావేశంలో సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, సంబంధిత అధికారులు, మీడియా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.