హనుమకొండ (రైట్స్ మీడియా): తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో టైగర్ నల్లా నర్సింహులు అలుపెరుగని పోరాట యోధుడని వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు చకిలం ఉపేందర్ అన్నారు. హనుమకొండ జిల్లా కేంద్రంలో వరంగల్ హనుమకొండ జిల్లా బార్ అసోసియేషన్ల అధ్వర్యంలో చకిలం ఉపేందర్ అధ్యక్షతన గురువారం జరిగిన తెలంగాణ టైగర్ నల్లా నర్సింహులు 33వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి మాట్లాడారు. ఈ తరం ప్రజలు వారి స్ఫూర్తిని పొంది ముందుకు సాగాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ బార్ కౌన్సిల్ మెంబర్ దుస్సా జనార్దన్ మాట్లాడుతూ.. నల్లా నర్సింహులు నిరంకుశ విస్నూరు దొరను, భూస్వామ్యుల ఆగడాలను ఎదిరించి ఎన్నో కేసులను ఎదుర్కొన్నారని, వారితో తనకు గల సహచర్యాన్ని అనుభవాలను పంచుకున్నారు. తొర్రూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు వీర వెంకట రత్నం మాట్లాడుతూ నల్లా నర్సింహులు జీవిత చరిత్ర చదివి ప్రేరణ పొందానని నల్ల నర్సింహులు తీవ్ర నిర్బంధంలో కూడా తను నమ్మిన ఆశయాలకోసం పోరాడారని, తెలంగాణ పేద రైతులకోసం ఉరికొయ్యలను కూడా ఎదిరించి పోరాడిన చరిత్ర వారిదని, యువతరం తెలంగాణ పోరాటయోధులను మరువరాదని అన్నారు.

ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిని నరేందర్ మాట్లాడుతూ.. నల్లా నరసింహులు భూమికోసం, భుక్తికోసం వెట్టిచాకిరి విముక్తికోసం పోరాడారని, ఆయన పోరాట స్పూర్తిని పొంది బహుజనుల హక్కుల కోసం ఐక్య పోరాటం చేయాలని అన్నారు.

వరంగల్ బార్ మాజీ అధ్యక్షులు వలుస సుధీర్ మాట్లాడుతూ.. నల్ల నర్సింహులుకు అనాటి పాలకులు మూడుసార్లు ఉరిశిక్ష విధించబడినప్పటికీ ఆయన ధైర్యం కోల్పోలేదని, న్యాయస్థానాల్లో సైతం ధైర్యంగా తన వాదనలు వినిపించారని, ఆయన ధైర్యసాహసాలను చూసి పోలీసు అధికారులు సైతం ఆశ్చర్యపోయేవారని అంటూ ఆయన భార్య వజ్రమ్మ త్యాగం కూడా అనన్యమైనదని, నల్లా నరసింహులు భార్య వజ్రమ్మ కూడా పోరాట జీవితంలో అనేక కష్టాలను ఎదుర్కొన్నారని, భర్త ఉద్యమంలో ఉన్న సమయంలో ఆమెను కూడా అరెస్టు చేసి జైలులో ఉంచారని, జైలులో ఉన్నప్పుడే ఆమె ఒక ఆడశిశువుకు జన్మనిచ్చినట్లు తెలియజేస్తూ పీడిత ప్రజల విముక్తి కోసం నల్లా నర్సింహులు తన జీవితాన్నే త్యాగం చేసిన మహోన్నత పోరాట యోధుడని అలాంటి మహానీయుల నుండి బహుజన సమాజం స్ఫూర్తి పొంది అసమానతలను ప్రశ్నించే చైతన్యాన్ని సాధించి ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తూ బీసీ ఎస్సీ ఎస్టీ లు తమ హక్కులకోసం ఏకమై ఐక్య ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు.

మరుగునపడిన నల్ల నర్సింహులు చరిత్రను భావితరాలకు అందించాలని తన వయసును లెక్కచేయకుండా అవిరామంగా కృషి చేస్తున్న సామాజిక వేత్త దాసరి జనార్ధన్ ను వరంగల్ బార్ అధ్యక్షులు చకిలం ఉపేందర్ శాలువతో సత్కరించారు.

ఈ సమావేశంలో ఇరు బార్ అసోసియేషన్ల కార్యదర్శులు ఆర్ నాగేంద్ర చారి, ఊరుగొండ నరేందర్, ఉపాధ్యక్షురాలు వి లలితకుమారి, రఘుపతి, సంయుక్త కార్యదర్శి ఆడెపు సునిల్, సీనియర్ న్యాయవాదులు దాసరి ప్రేమ్ సాగర్, సాయిని నరేందర్, చిల్లా రాజేంద్ర ప్రసాద్, విలాసాగరం సురేందర్ గౌడ్, నీలా శ్రీధర్, సిద్ధు నాయక్, నర్సింగరావు, జన్ను పద్మ, నర్సింగ్, గంజి రమేష్, రాచకట్ల కృష్ణ, కుసుమ జగదీష్, పాము శరత్, నల్ల మహాత్మ, గురిమిల్ల రాజు, ఓరుగంటి కోటేశ్వర్ తదితర న్యాయవాదులు పెద్దఎత్తున పాల్గొన్నారు.