విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు పునాది వేసే ప్రతి ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయురాలు ఉత్తములేనని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు. శనివారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో గురుపూజోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి జ కలెక్టర్ పూలమాల వేసి..జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు విద్యార్థుల జీవితాన్నే కాకుండా సమాజాన్ని, భవిష్యత్ తరాన్ని ఉత్తమ మార్గం వైపు మార్చగలరని, నడిపిస్తారని అన్నారు. ఉపాధ్యాయ వృత్తి అనేది కేవలం ఉద్యోగం మాత్రమే కాదని సమాజాన్ని నిలబెట్టే బాధ్యత కలిగి ఉంటుందన్నారు.

సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయ వృత్తి కీలకమైందన్నారు. ఉపాధ్యాయుల కృషితోనే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు.
తరగతి గదుల్లో పాఠ్యాంశాలే కాకుండా మానవత్వపు విలువలను ఉపాధ్యాయులు నేర్పిస్తున్నారని పేర్కొన్నారు. నిరుపేద విద్యార్థుల భవిష్యత్తుని ఉన్నత స్థానంలో నిలబెట్టేందుకు ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలని కోరారు. విద్యారంగం బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటూ ఉండడంతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మారాయని అన్నారు.

విద్యార్థులు తమ ఉపాధ్యాయులను ఎన్నటికి మర్చిపోరని పేర్కొన్నారు. జిల్లాలో విద్యారంగాన్ని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.
జిల్లాలో పాఠశాల విద్యాశాఖలో ప్రాథమిక పాఠశాలలు 299, ప్రాధమికోన్నత పాఠశాలలు 146, ఉన్నత పాఠశాలలు 396 ఉన్నాయని... జిల్లాలో మొత్తం 841 పాఠశాలల్లో 1,56,995 మంది విద్యార్థులు చదువుతున్నారన్నారు

విద్యార్థుల నమోదు, హాజరు, అభ్యసన ఫలితాలు, ఎఫ్ఎల్ఎన్, డిజిటల్ విద్య, ఉపాధ్యాయుల సామర్థ్యాభివృద్ధి, సమాజ భాగస్వామ్యం వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రాథమిక విద్యలో చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం, ప్రాథమిక గణిత నైపుణ్యాలు బలంగా ఉన్నప్పుడే విద్యార్థి తర్వాత విజయవంతంగా ముందుకు వెళ్తారన్నారు.

పాఠశాలల్లో ఎఫ్ఎల్ఎ నైపుణ్యాలను అభివృద్ధి చేసి నమూనా పాఠశాలలుగా బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థుల విద్యా ప్రగతి ఆధారంగా లక్ష్యాలను నిర్దేశించుకోవడం అవసరమైన విద్యార్థులకు టీచర్ సపోర్ట్ గ్రూప్స్ ద్వారా సహాయము అందించడం జరుగుతుందన్నారు. డిజిటల్ విద్యా విధానాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతుందన్నారు. పూర్వ ప్రాథమిక విద్యార్థులకు ఆటపాటల ద్వారా వారి వయసుకు తగిన చదువును అందిస్తున్నామని తెలిపారు. కేజీబీవీ విద్యార్థులకు నీట్, జెఈఈ మెయిన్స్, క్లాట్ కోర్సులకు శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు.

ఈ విద్యా సంవత్సరంలో జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించడం జరిగిందన్నారు. ఎస్ ఎస్ సి రిజల్ట్స్ లో 2024- 25 విద్యా సంవత్సరంలో 18వ స్థానంలో ఉన్న జిల్లా.. ఉపాధ్యాయుల కృషితో 2025- 26 విద్యా సంవత్సరంలో 9వ ర్యాంకు చేరుకున్నామని చెప్పారు. ఈ విద్యా సంవత్సరంలోనూ ఇంకా మెరుగైన స్థానాన్ని సాధించేందుకు కృషి చేస్తామన్నారు. బడి ఈడు పిల్లలను బడిలోకి తీసుకురావడం మాత్రమే కాదని ప్రతి బిడ్డకు విద్యాబుద్ధులు నేర్పించి ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు.

ఈ లక్ష్యసాధనలో జిల్లా యంత్రాంగం విద్యాశాఖ అధికారులు ఎంఈఓ లు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు సమష్టిగా పనిచేసి జిల్లాను విద్యారంగంలో మరింత తీసుకువెళ్లగలమని అన్నారు. గురుపూజోత్సవం సందర్భంగా జిల్లాలో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలను గురించి జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్.వి. గిరిరాజ్ గౌడ్ నివేదించారు.

గురుపూజోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా నిలిచిన ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించి జ్ఞాపిక, ప్రశంసా పత్రాలను కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. పాఠశాల విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమంలో ఎంఈవోలు నెహ్రూ నాయక్, మనోజ్ కుమార్, ప్లానింగ్ కోఆర్డినేటర్ మహేష్, ఏఎంఓ డాక్టర్ మన్మోహన్, సునీత, సుమా, పలువురు ప్రధానోపాధ్యాయులు, వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.